Wednesday, January 22, 2025

కేరళ మాజీ సిఎం కన్నుమూత.. సంతాపం తెలిపిన ప్రధాని, రాష్ట్రపతి

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం/బెంగళూరు : దేశ సీనియర్ రాజకీయ నాయకుల్లో ఒకరైన కేరళ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత 79 ఏళ్ల ఊమెన్ చాందీ మంగళవారం ఉదయం కన్నుమూశారు. గత కొద్ది కాలంగా ఆయన అనారోగ్యంతో గొంతు సమస్యలతో బాధపడుతున్నారు. బెంగళూరులో చికిత్సపొందుతుండగా మంగళవారం తెల్లవారు జామున 4.25 గంటల సమయంలో మృతి చెందారని ఆయన కుమారుడు చాందీ ఊమెన్ వెల్లడించారు. ఊమెన్ చాందీకి భార్య మరియమ్మ, కూతురు మేరియా ఊమెన్, కుమారులు చాందీ ఊమెన్, అచ్చు ఊమెన్ ఉన్నారు. చాందీ మృతికి సంతాప సూచకంగా కేరళ ప్రభుత్వం మంగళవారం సెలవు ప్రకటించింది.

రాష్ట్రంలో జరిగే అన్ని పరీక్షలను వాయిదా వేశారు. ఊమెన్ చాందీ కేరళకు రెండుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో 12 సార్లు కేరళ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2004 నుంచి 2006 వరకు , అలాగే 2011 నుంచి 2016 వరకు కేరళ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కే. కరుణాకరన్, ఏకే ఆంటోనీ, మంత్రి వర్గాల్లో ఆర్థిక శాఖ తో సహా కీలక మంత్రిత్వశాఖలను నిర్వర్తించారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జిగా కూడా పనిచేశారు. దాదాపు 50 ఏళ్లకు పైగా ఎమ్‌ఎల్‌ఎగా పుతుపల్లి నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 1943 అక్టోబర్ 31న కొట్టాయం జిల్లా లోని కుమరకోమ్‌లో జన్మించిన ఊమెన్ చాందీ సాధారణ కార్యకర్తగా రాజకీయాల్లోకి ప్రవేశించారు.

27 ఏళ్ల వయసులో 1970లో తొలిసారి ఎమ్‌ఎల్‌ఎగా ఎన్నికయ్యారు. అంతకు ముందు కేరళ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. చాందీ మృతిపై కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య, డిప్యూటీ సిఎం డికె శివకుమార్, తమిళనాడు సిఎం స్టాలిన్, తదితరులు సంతాపం తెలిపారు. ఊమెన్ చాందీ పార్థివ దేహాన్ని బెంగళూరు నుంచి తిరువనంతపురం తరలించారు. అక్కడ నుంచి కొట్టాయం తీసుకెళ్లి స్వస్థలం పుతుపల్లిలో గురువారం అంత్యక్రియలు నిర్వహిస్తారు.

ప్రధాని మోడీ, రాష్ట్రపతి ముర్ము సంతాపం
ప్రధాని మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము,అనేక మంది కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేశారు. కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్, కేరళ సిఎం పినరయి విజయన్ సంతాపం వెలిబుచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News