Monday, December 23, 2024

మహారాష్ట్ర మాజీ సిఎం అశోక్ చవాన్ బిజెపిలో చేరిక

- Advertisement -
- Advertisement -

ముంబై: బాల్యం నుంచి తాను పెరిగి, ఎదిగిన కాంగ్రెస్ పార్టీకి సోమవారం రాజీనామా చేసిన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు అశోక్ చవాన్ 24 గంటలు గడవక ముందే కాషాయ కండువా కప్పుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో మంగళవారం ఆయన బిజెపిలో చేరారు. చవాన్ వెంట ఆయన సహచరుడు, మాజీ ఎంఎల్‌సి అమర్‌నాథ్ రాజుర్కర్ కూడా బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. రానున్న రోజుల్లో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంఎల్‌సిలతోసహా తన అనుచరులు బిజెపి సారథ్యంలోని ఎన్‌డిఎలో చేరనున్నట్లు చవాన్ తెలిపారు.

చవాన్ గతంలో రెండుసార్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా, మహారాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా, పనిచేశారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేయాలన్న కోరికతోనే తాను బిజెపిలో చేరినట్లు చవాన్ తెలిపారు. చవాన్ రాకతో మహారాష్ట్ర, మరాఠ్వాడలో బిజెపి మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తాను కాంగ్రెస్‌ను వీడినందుకు కొందరు బలపరిచారు, కొందరు విమర్శించారని ఆయన అన్నారు. తాను బుదరచల్లే కార్యక్రమానికి పాల్పడబోనని, తాను నేటి నుంచి బిజెపి కోసం పనిచేస్తానని ఆయన తెలిపారు. తాను బిజెపికి ఎటువంటి షరతులు విధించలేదని, ఏ బాధ్యతను అప్పగించినా స్వీకరిస్తానని ఆయన చెప్పారు. వ్యక్తిగత కారణాలతోనే తాను కాంగ్రెస్‌కు రాజీనామా చేశానని, తనను ఎవరూ బిజెపిలో చేరాలని ఆహ్వానించలేదని ఆయన తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి శంకర్‌రావు చవాన్ కుమారుడైన 65 ఏళ్ల అశోక్ చవాన్ గతంలో ఒకసారి ఎంపిగా, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంఎల్‌సిగా పనిచేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News