హైదరాబాద్: తెలంగాణకు చెందిన మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ (67) కరోనాతో కన్నుమూశారు. మూడు రోజుల క్రితం నగరంలోని కిమ్స్ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. చందూలాల్ స్వస్థలం ములుగు జిల్లా జగ్గన్నపేట్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చందూలాల్ మంత్రిగా పనిచేశారు. ఎన్టీఆర్, కెసిఆర్ మంత్రివర్గాల్లో సేవలందించారు. గ్రామ సర్పంచ్‌గా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన చందూలాల్ మూడు సార్లు అసెంబ్లీకి, రెండు సార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. ఆయన మూడుసార్లు ఎంఎల్ఎగా, రెండుసార్లు ఎంపిగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమం టిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న కాలంలో ఆయన 2005లో టిఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కెసిఆర్‌కు సన్నిహితుల్లో ఆయనొకరుగా గుర్తింపు తెచ్చుకు న్నారు. చందూలాల్ కు భార్య నలుగురు పిల్లలు ఉన్నారు.
former minister azmeera chandulal passed away