హైదరాబాద్ : మాజీ మంత్రి, బిజెపికి రాజీనామా చేసిన వికారాబాద్ నియోజకవర్గ మాజీ ఎంఎల్‌ఎ ఎ. చంద్ర శేఖర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ నెల 18న తెలంగాణ పర్యటనకు వస్తున్న ఎఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సమక్షంలో చంద్ర వేఖర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. బిజెపికి రాజీనామా చేసిన తర్వాత రేవంత్ రెడ్డి ఆదివారం సాయంత్రం కాంగ్రెస్ నాయకులతో కలిసి జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో చంద్రశేఖర్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బిజెపి మాటలు నమ్మి చంద్రశేఖర్ గతంలో ఆ పార్టీలో చేరారని తెలిపారు. బిఆర్‌ఎస్ వ్యతిరేక రాజకీయ పునరేకీకరణలో భాగంగా ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించామని అందుకు ఆయన సూత్రప్రాయంగా అంగీకరించారని తెలిపారు. ఈ నెల 18న మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా సభ నిర్వహించనున్నామని, ఆ సభలో పేదలకు మేలు జరిగే డిక్లరేషన్ ప్రకటన ఉంటుందని రేవంత్ రెడ్డి తెలిపారు.
దళితుల భూములను రకరకాల రూపాల్లో 35లక్షల ఎకరాలు ఈ ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని, ప్రభుత్వమే కబ్జాకోరుగా మారి భూములు అమ్ముకుంటోందని ఆరోపించారు. దళితులకు, గిరిజనులకు ఇచ్చే అసైన్డ్ భూములకు వారికే పూర్తి యాజమాన్య హక్కు కలిగించాలని చంద్రశేఖర్ సూచించారని ఈ ప్రతిపాదనను కాంగ్రెస్ పార్టీ అంగీకరించిందన్నారు. శశబిషలు అవసరం లేదని, బిజెపి, బిఆర్‌ఎస్ ది ఫెవికాల్ బంధమని ఆయన విమర్శించారు. రాష్ట్రానికి పట్టిన చీడ, పీడలను వదిలించేందుకు కాంగ్రెస్ తో కలిసి రావాలని కోరారు. జనాభా దామాషా ప్రకారం ఎస్‌సి, ఎస్‌టి రిజర్వేషన్లు పెంచుతామని, వారికి రావాల్సిన హక్కులను పంచుతామని వారి మధ్య పంచాయతీలను తెంచుతామని రేవంత్ రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నా : చంద్రశేఖర్
బిజెపికి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్ కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానన్నారు. తెలంగాణలో బిఆర్‌ఎస్‌కు కాంగ్రెస్ మాత్రమే ప్రత్యామ్నాయమని అన్నారు. తెలంగాణలో బిఆర్‌ఎస్‌ను బిజెపి కాపాడుతోందని అన్నారు. బిజెపి విధానాలు నచ్చకనే ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. బండి సంజయ్‌ని రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించటం తప్పు అని వ్యాఖ్యానించారు. బిజెపి, బిఆర్‌ఎస్ ఒక్కటేనని గ్రామస్థాయిలో కూడా చర్చ జరుగుతోందన్నారు. తెలంగాణలో బిజెపిది మూడో స్థానమేనన్నారు. తెలంగాణ బిజెపికి ప్రణాళికలు లేవని, కష్టపడే నాయకులకు ఆ పార్టీలో చోటు లేదని చంద్రశేఖర్ అన్నారు. బిజెపిలో చేరిన అనేక మంది తెలంగాణ ఉద్యమ నేతలు భంగపాటుకు గురువుతున్నారని చంద్రశేఖర్ అన్నారు.