ఇందిర కోసం ఎంపి సీటు త్యాగం చేసిన ఘనత
చిక్మగుళూరు : కర్నాటకలో ప్రముఖ రాజకీయ నాయకుడు చంద్రేగౌడ మృతి చెందారు. 87 సంవత్సరాల గౌడకు భార్య , నలుగురు కుమార్తెలు ఉన్నారు. కర్నాటకలో మాజీ మంత్రిగా కూడా ఉన్న చంద్రేగౌడ 1978లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ పోటీకి వీలుగా తన చిక్మగుళూరు నుంచి ఎంపి సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ విధంగా చిక్మగుళూరు ఎమర్జెన్సీ అనంతర దశలో ఇందిరా గాంధీకి రాజకీయ జీవం పోసింది.
ఆమె అక్కడి నుంచి రికార్డు మెజార్టీతో గెలిచారు. మంగళవారం తెల్లవారుజామున చంద్రేగౌడ వయోవృద్ధ సమస్యలతో బాధపడుతూ చిక్మగుళూరు జిల్లాలోని ముదిగెరె తాలూకా దరదాహలిలో తన స్వగృహంలో కన్నుమూసినట్లు కుటుంబ సన్నిహితులు తెలిపారు. బుధవారం ఆయన అంత్యక్రియలు జరుగుతాయి. కర్నాటకలో అత్యంత సీనియర్ నేతగా గౌడకు పేరుంది. రాష్ట్రం నుంచి ఆయన నాలుగు చట్టసభలకు ప్రాతినిధ్యం వహించారు.
ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా , లోక్‌సభ, రాజ్యసభల ఎంపిగా గెలిచిన ఘనత ఉంది. ప్రత్యేకించి సీటు త్యాగంతో తరువాతి దశలో ఇందిరా గాంధీ విజయానికి పాటుపడటంతో దేశ రాష్ట్ర రాజీకయాలలో ఆయన కీలక స్థానం దక్కించుకున్నారు.