సిఎం కెసిఆర్‌కు మాజీ మంత్రి మోత్కుపల్లి ప్రశంసలు
హైదరాబాద్: దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో దళితబంధు పథకం సిఎం కెసిఆర్ అమలు చేయడం అభినందనీయమని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ప్రశంసల వర్షం కురిపించారు. హైదరాబాద్‌లో నగరంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మోత్కుపల్లి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో అంబేద్కర్ వారసుడిగా సిఎం కెసిఆర్ చరిత్రలో నిలుస్తారని కొనియాడారు. తన ఆలేరు నియోజకవర్గంలోని వాసాలమర్రిలో దళితబంధు ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. దళితబంధులాంటి పథకం ఇంత వరకు ఎవరు తీసుకురాలేదని, అంత ధైర్యం ఎవరూ చేయలేదని మోత్కుపల్లి పేర్కొన్నారు. దళితబంధును బిజెపి, కాంగ్రెస్ పార్టీ నాయకులు దేశవ్యాప్తంగా అమలయ్యేలా చూడగలరా..? అని ప్రశ్నించారు. ఢిల్లీకి వెళ్లి దేశమంతా అమలయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
ఈ పథకాన్ని ఆపాలని చాలా మంది చూస్తున్నారు, మన మీద కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఒక సీనియర్ నాయకుడిగా ఒక రాజకీయ పార్టీకి రాజీనామా చేసి ప్రజల కోసం బయటికి వచ్చినట్లు తెలిపారు. డబ్బు తీసుకుని వస్తా అని చెప్పి తీసుకుని వచ్చిన మొగాడు సిఎం కెసిఆర్ అని ప్రశంసించారు. దళితులు ఇంకా బలహీన వర్గాలుగా ఉంచాలని చాలా మంది కుట్ర చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో మరో డాక్టర్ బిఆర్ అంబేడ్కర్‌లా సిఎం కేసీఆర్ చరిత్రలో మిగిలిపోతారని చెప్పారు. మరియమ్మ ఘటన తరువాత సిఎం కెసిఆర్ ఇలాంటి ఘటనలు జరిగితే తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారని గుర్తుచేశారు. అలానే వరంగల్‌లో ఎస్‌ఐపై అత్యాచారం కేసులో వెంటనే చర్యలు తీసుకున్నారని తెలిపారు.
ప్రజల కోసం బతికే నాయకుడు కెసిఆర్ అని నేరుగా దళితుల ఖాతాల్లో రూ.10 లక్షలు వేయడం ఎక్కడా చూడలేదని తెలిపారు. దళితబంధు, దళితులందరికీ వస్తుందనడానికి వాసాలమర్రి నిదర్శనమని చెప్పారు. దళితబంధు హుజురాబాద్ నియోజకవర్గానికే పరిమితమన్నవారు.. ఇప్పుడు సిగ్గుతో తలదించుకోవాలన్నారు. సిఎం కెసిఆర్ దత్తత గ్రామం, యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో దళిత బంధు పథకం అమలుకు అధికారులు ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించారన్నారు. వాసాలమర్రిలో దళిత బంధు అమలుకు ప్రభుత్వం గురువారం 76 కుటుంబాలకు రూ.7.60 కోట్లు విడుదల చేసిందన్నారు. ఈ మేరకు జివొఆర్‌టి నం.110ను ఎస్‌సి అభివృద్ధి విభాగం కార్యదర్శి రాహుల్ బొజ్జా జారీ చేశారని మోత్కుపల్లి వివరించారు.