Thursday, January 23, 2025

మాజీ మంత్రి నారాయణకు బెయిల్ మంజూరు

- Advertisement -
- Advertisement -

Former minister Narayana granted bail

 

మనతెలంగాణ/హైదరాబాద్ : ఎపిలో పదో తరగతి ప్రశ్నపత్రాల లీక్ కేసులో అరెస్ట్ అయిన నారాయణ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు, మాజీ మంత్రి నారాయణకు బుధవారం నాడు బెయిల్ లభించింది. ఈక్రమంలో నారాయణకు వ్యక్తిగత పూచీకత్తుతో మేజిస్ట్రేట్ సులోచనారాణి బెయిల్ మంజూరు చేశారు. పదో తరగతి ప్రశ్నపత్రాల లీక్ కేసులో నారాయణను హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన పోలీసులు మంగళవారం రాత్రి ఆయనను చిత్తూరుకు తరలించారు. చిత్తూరులోని ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షల నిర్వహించిన అనంతరం నారాయణను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. నారాయణ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు, మాజీ మంత్రి నారాయణపై చిత్తూరు పోలీసులు నమోదు అభియోగాన్ని న్యాయమూర్తి తోసిపుచ్చారు. ముఖ్యంగా 2014లోనే నారాయణ విద్యాసంస్థల ఛైర్మన్ పదవికి నారాయణ రాజీనామా చేసినట్లు ఆయన తరఫున న్యాయవాదులు న్యాయమూర్తికి ఆధారాలు చూపించారు. దీంతో ఆ వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు. రూ.లక్ష చొప్పున ఇద్దరు వ్యక్తులు జామీను ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశాలిచ్చారు.

ఈ సందర్భంగా నారాయణ తరపున న్యాయవాది మాట్లాడుతూ విద్యాసంస్థల అధినేతగా ఉన్నారని నారాయణపై పోలీసులు అభియోగం మోపారని, కానీ 2014లోనే ఆ విద్యాసంస్థల అధినేతగా ఆయన వైదొలిగినట్లు న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లామన్నారు. నారాయణ విద్యాసంస్థలతో నారాయణకు సంబంధం లేదని, దానికి సంబంధించిన డాక్యుమెంట్లను న్యాయమూర్తికి సమర్పించినట్లు తెలిపారు. నేరారోపణలు నమ్మేవిధంగా లేదని, ప్రశ్నా పత్రాల లీకేజీ జరిగిన నాటికి నారాయణ ఆ విద్యాసంస్థల అధినేత కాదని జడ్జి అభిప్రాయానికి వచ్చినట్లు న్యాయవాది తెలిపారు. ఈ నెల 18లోగా రూ. లక్ష చొప్పున ఇద్దరి పూచీకత్తు ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారని, నారాయణపై పోలీసులు అభియోగాలను నిరూపించలేదని న్యాయవాది పేర్కొన్నారు.

హైకోర్టును ఆశ్రయిస్తాం ః సజ్జల రామకృష్ణారెడ్డి

మాజీ మంత్రి నారాయణ బెయిల్ రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయిస్తామని ఎపి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. నారాయణ విద్యా సంస్థల్లో వంద శాతం ఉత్తీర్ణత కోసం ఓ వ్యవస్థ మాల్ ప్రాక్టీసుకు పాల్పడుతూ పిల్లల జీవితాలలో ఆడుకుంటోందని ఆయన ఆరోపించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. నారాయణ అరెస్టుపై చంద్రబాబు స్పందించిన తీరు బాధాకరమన్నారు. ఓ విప్లవకారుడిని అరెస్టు చేసినట్లు హడావిడి చేస్తున్నారని మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకుండా వదిలిపెట్టాలా? అని సజ్జల ప్రశ్నించారు. ప్రశ్నపత్రాల లీకేజీతో సంబంధం ఉన్నందువల్లే నారాయణను పోలీసులు అరెస్టు చేశామని, రాజకీయ ముసుగులో ఎన్ని రోజులు తప్పించుకుంటారో చూస్తామన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News