మహబూబ్‌నగర్ : మక్తల్ మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, పోలిట్ బ్యూరో సభ్యుడు దయాకర్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయన గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. దయాకర్‌రెడ్డి హైదరాబాద్‌లోని ఒకప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆయనను ఆదివారం సొంత గ్రామమైన మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట, మండలం పర్కాపూర్ గ్రామానికి తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న బంధుమిత్రులు,అభిమానులు పెద్ద ఎత్తున ఆయన నివాసానికి చేరుకొని పరామర్శిస్తున్నారు.
దయాకర్‌రెడ్డి 1994/1999 తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో తెలుగుదేశం,టిఆర్‌ఎస్ పొత్తులో భాగంగా ఆయన టికెట్ రాకపోవడంతో మక్తల్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. మొత్తంగా మూడుసార్లు ఎమ్మెల్యేగా కొనసాగారు. టిడిపి పోలిట్ బ్యూరో సభ్యునిగా ప్రసుత్తం కొనసాగుతున్నారు. ఈయన భార్య సీతమ్మ దేవరకద్ర నియోజకవర్గానికి 2009 నుంచి 2014 వరకు ఎమ్మెల్యేగా పని చేశారు. దయాకర్‌రెడ్డి దంపతులకు ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు.
పరామర్శ: మక్తల్ మాజీ ఎమ్మెల్యే దయాకర్‌రెడ్డి ఆరోగ్యం విషమంగా ఉండటంతో మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే రాజేంద్రరెడ్డి, నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే నాగం జనార్ధన్‌రెడ్డి, గద్వాల జిల్లా మాజీ ఎమ్మెల్యే భరత సింహరెడ్డి, డిఎస్పి కిషన్ తదితరులు పరామర్శించారు.