ఎమ్మెల్యేగా తాను గెలిచి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది
బెంజ్ కార్లలో తిరిగే వారికి బస్సు గురించి ఎలా తెలుస్తోంది
మనతెలంగాణ/హైదరాబాద్: ఎమ్మెల్యేగా తాను గెలిచి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని, బిఆర్‌ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కెటిఆర్, హరీష్ రావులతో ఒక ఆట ఆడుకున్నేవాడినని ఆయన తెలిపారు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు నుంచే ఆరు గ్యారెంటీల అమలుపై సిఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ పెట్టారని గుర్తు చేశారు.
మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసి బస్సుల్లో మహిళలకు కల్పిస్తోన్న ఉచిత ప్రయాణ సౌకర్యంపై మహిళంతా హ్యాపీగా ఉన్నారన్నారు. ఇది తాను ఆర్టీసి బస్‌లో స్వయంగా ప్రయాణించి చూసిన అనుభవమని ఆయన చెప్పారు. బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కెటిఆర్, హరీశ్ రావులు కార్లలో తిరిగే వాళ్లని… బస్సులో ప్రయాణించే వారి గురించి వాళ్లకేం తెలుస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంజ్ కార్లలో తిరిగే వారికి బస్సు ఇబ్బందుల గురించి ఎలా తెలుస్తుందని ఆయన ఎద్దేవా చేశారు.