మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు, ఉమ్మడి ఎపి మాజీ పిసిసి చీఫ్ డి.శ్రీనివాస్ శనివారం తెల్లవారుజామున 3.30 గంటలకు గుండెపోటుతో హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. కాగా, ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. డిఎస్ మృతి పట్ల తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో డిఎస్ కీలక పాత్ర పోషించారని ఆయన గుర్తు చేశారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్‌కు డిఎస్ విశిష్ట సేవలు అందించారని సిఎం రేవంత్ తెలిపారు. డిఎస్ కుటుంబసభ్యులకు సిఎం రేవంత్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాంగ్రెస్‌కు డిఎస్ చేసిన సేవలను సిఎం స్మరించుకున్నారు. డిఎస్ అంత్యక్రియలకు సిఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నట్లు అధికారులు వెల్లడించారు.
అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు..
డి.శ్రీనివాస్‌కు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేలా తగిన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని సిఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కాగా, నేడు (ఆదివారం) నిజామాబాద్‌లో డి.శ్రీనివాస్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. నిజామాబాద్ బైపాస్ రోడ్డులోని సొంత స్థలంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు డిఎస్ పెద్ద కొడుకు, నిజామాబాద్ మాజీ మేయర్ సంజయ్ తెలిపారు.
నివాళులు అర్పించిన డిప్యూటీ సిఎం
మరో వైపు డిఎస్ మరణవార్త తెలుసుకున్న ఆయన అభిమానులు, కాంగ్రెస్, బిజెపి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆయన ఇంటికి చేరుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ డిఎస్ పార్థీవ దేహానికి నివాళులర్పించారు. పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ డిఎస్ పార్థివ దేహాంపై కాంగ్రెస్ నాయకులు పార్టీ జెండా కప్పారు. డిఎస్ పార్థివ దేహంపై కాంగ్రెస్ పార్టీ జెండా కప్పి ఆయన చివరి కోరికను టిపిసిసి నేతలు తీర్చారు. ఈ మేరకు డిప్యూటీ సిఎం భట్టి, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పిసిసి ఉపాధ్యక్షుడు నిరంజన్ తదితరులు డిఎస్ భౌతికాయానికి నివాళులు అర్పించారు. డిఎస్ కుమారులు సంజయ్, అరవింద్‌లను మంత్రులు పరామర్శించారు. ఈ సందర్భంగా డిఎస్ సేవలను గుర్తిస్తూ కాంగ్రెస్ పార్టీ జెండా కప్పడంపై పలువురు కార్యకర్తలు, డిఎస్ అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.
ప్రధాని మోడీ సంతాపం
డిఎస్ మృతి పట్ల ప్రధాని మోడీ, మాజీ సిఎం కెసిఆర్, కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ, ఎంపి మల్లురవి, ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్ రెడ్డి, కాంగ్రెస్ నేత మధుయాష్కీగౌడ్, మాజీ మంత్రులు హారీష్ రావు, కెటిఆర్, ప్రశాంత్ రెడ్డి, బిఆర్‌ఎస్ రాజ్యసభ ఎంపి వద్దిరాజు రవిచంద్ర, బిజెపి రాజ్యసభ ఎంపి లక్ష్మణ్‌లు సంతాపం తెలిపారు.