మన తెలంగాణ/హైదరాబాద్ : మాజీ ఎంపి డాక్టర్ మందా జగన్నాథం కన్నుమూశారు. ఆయన వయస్సు 73 ఏళ్లు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆయన మరణవార్త తెలిసిన సన్నిహితులు, రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులు సంతాపం తెలిపారు. 1951, మే 22న నాగర్‌కర్నూల్ జిల్లాలోని ఇటిక్యాలలో మంద జగన్నాథం జన్మించాడు. ఆయన తండ్రి పెద్ద పుల్లయ్య. జగన్నాథం వైద్య విద్యలో ఎంఎస్ పూర్తి చేశాడు.
1996లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు తెలుగు దేశం పార్టీలో మందా జగన్నాథం చేరారు. అనంతరం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానం నుంచి టిడిపి అభ్యర్థిగా బరిలో నిలిచి గెలిచారు. ఇదే పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వరుసగా జరిగిన ఎన్నికల్లో నాలుగు సార్లు 1996, 1999, 2004, 2009 ఆయన ఎంపిగా విజయం సాధించారు. అయితే 2009లో ఆయన టిడిపి వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఆ పార్టీ నుంచి ఆయన ఎంపిగా అదే స్థానం నుంచి గెలుపొందారు.
ఇక 2014లో రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలు అంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కావడంతో ఆయన కాంగ్రెస్ పార్టీ వీడి నాటి టిఆర్‌ఎస్‌లో చేరారు. అదే సమయంలో అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలు జరగడంతో టిఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థిగా నాగర్ కర్నూల్ స్థానం నుంచి బరిలో నిలిచి ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో మందా జగన్నాథం ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. కానీ నాటి కెసిఆర్ ప్రభుత్వం ఆయన సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించింది. అందులోభాగంగా 2018లో న్యూఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ప్రత్యేక ప్రతినిధిగా నియమించింది. దీంతో ఆయనకు కేబినెట్ హోదా సైతం కేటాయించింది. ఈ పదవి కాలం పూర్తయిన అనంతరం ఆయనకు ఈ పదవిని మరోసారి రెన్యూవల్ సైతం చేసింది.
సిఎం రేవంత్ నివాళి
మాజీ ఎంపి డాక్టర్ మందా జగన్నాధం మృతిపై సిఎం రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. నాగర్ కర్నూల్ లోకసభ సభ్యునిగా, సామాజిక, తెలంగాణ ఉద్యమకారునిగా మ ందా జగన్నాధం పాత్ర తెలంగాణ రాష్ట్రంలో మరుపురానిదన్నారు.
తెలంగాణ ఓ సీనియర్ రాజకీయ వేత్తను కోల్పోయింది : కెసిఆర్
మాజీ ఎంపీ, సీనియర్ రాజకీయ నాయకుడు, మంద జగన్నాథం మరణం పట్ల బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ సంతాపం ప్రకటించారు. మంద జగన్నాథం మరణంతో తెలంగాణ ఒక సీనియ ర్ రాజకీయవేత్తను కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. సీనియర్ పార్లమెంట్ సభ్యులు, మాజీ ఎంపి మంద జగన్నాధం మృతి పట్ల పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సంతాపం తెలిపారు. మందా జగన్నాథం మృతి పట్ల మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, సీత క్క, కొండా సురేఖలు సంతాపం తెలిపారు.