హైదరాబాద్: మాసబ్ ట్యాంక్‌లోని పశుసంవర్థక శాఖల కార్యాలయంలో మాజీ ఓఎస్డీ కళ్యాణ్ హల్‌చల్ చేశారు. కార్యాలయంలోని ఫైల్స్ అన్ని చించేసి సంచుల్లో మూట కట్టి బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించినట్టుగా ఆ శాఖ ఉద్యోగులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం మారడంతో ఓల్డ్ ఫైల్స్ అన్ని చించేసి తీసుకెళ్లేందుకు ఆయన ప్రయత్నించారని ఉద్యోగులు తెలిపారు. మాజీ తలసాని శ్రీనివాస్ యాదవ్ దగ్గర కళ్యాణ్ ఓఎస్డీగా పనిచేశారు. అయితే ప్రస్తుతం ఓఎస్డీగా ఆయన పదవీ కాలం అయిపోయి నాలుగు రోజులు అయినా డిపార్ట్ మెంట్‌కు వచ్చి ఫైల్స్‌ను తీసుకెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోంది.
దీంతోపాటు గతంలో ఫర్నీచర్ కోనుగోళ్లలో కూడా ఆయన అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు సైతం ఆయనపై వచ్చాయి. అప్పుడు కొనుగోలు చేసిన ఫర్నీచర్‌ను ఇప్పుడు వెనక్కి ఇవ్వాలని పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారులపై కళ్యాణ్ ఒత్తిడి తెచ్చినట్టుగా తెలిసింది. ఈ విషయంలో ఫర్నీచర్‌ను వెనక్కి ఇచ్చినప్పుడు కచ్చితంగా తమకు రశీదు ఇవ్వాలని డిపార్ట్‌మెంట్ అధికారులు కళ్యాణ్‌కు సూచించడంతో వాటి విషయంలో ఆయన వెనక్కి తగ్గినట్టుగా తెలిసింది. అయితే డిపార్ట్‌మెంట్ నుంచి ఎలాంటి ఫైల్స్ తీసుకెళ్లొద్దని సిఎస్ శాంతికుమారి ఆదేశాలు జారీ చేసినప్పటికీ సిబ్బంది సహకారంతో కళ్యాణ్ ఫైల్స్ చించేశారని ఉద్యోగులు ఆరోపించడం గమనార్హం.
ఎలాంటి ఫైల్స్ లేవు…కళ్యాణ్
ఇదే విషయమై మాజీ ఓఎస్డీ కళ్యాణ్‌ను వివరణ కోరగా అవి డిపార్ట్‌మెంట్ పేపర్లు కాదనీ, పాత పేపర్లు ఉంటే వాటిని చూడడానికి వచ్చానని ఆయన తెలిపారు. డిపార్ట్‌మెంట్ ఫైల్స్‌కు సంబంధించి ఇప్పటికే జిఏడికి సమాచారం ఇచ్చామని, ప్రస్తుతం డైరెక్టరేట్ కార్యాలయంలో ఫైల్స్ లేవని ఆయన తెలపడం గమనార్హం.