Friday, January 24, 2025

దుబాయ్‌లో పాక్ మాజీ నేత ముషారఫ్ మరణం

- Advertisement -
- Advertisement -

దుబాయ్/ఇస్లామాబాద్ : పాకిస్థాన్ మాజీ అధ్యక్షులు, సైనిక మాజీ ప్రధానాధికారి పర్వెజ్ ముషారఫ్ కన్నుమూశారు. 79 సంవత్సరాల ఈ పాకిస్థాన్ మాజీ నియంత గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్‌లో ప్రవాస జీవితం గడుపుతున్న ఆయన దుబాయ్‌లో ఓ ఆసుపత్రిలో ఆదివారం మృతి చెందినట్లు అక్కడి వార్తా సంస్థలు తెలిపాయి. 1999లో కార్గిల్ యుద్ధానికి ప్రధాన సూత్రధారిగా ముషారఫ్ నిలిచారు. దేశంలో తిరుగులేని విధంగా చక్రం తిప్పిన ముషారఫ్ ఆ తరువాత పలు అభియోగాలతో ప్రత్యేకించి మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో హత్యోదంతంలో పలు కేసులతో దేశం విడిచి వెళ్లారు. భారతదేశ విభజనకు పూర్వం 1943లో ఢిల్లీలో జన్మించిన ముషారఫ్ తమ పాలనాక్రమంలో పూర్తి స్థాయిలో భారతదేశం పట్ల శతృత్వాన్ని, విద్వేషాన్ని వ్యక్తపర్చారు.

ముషారఫ్ నాలుగు సంవత్సరాల బాలుడిగా ఉన్నప్పుడే దేశ విభజనలో భాగంగా ఆయన కుటుంబం పాకిస్థాన్‌కు తరలివెళ్లింది. కరాచీలో స్థిరపడింది. అక్కడనే ముషారఫ్ విద్యాభ్యాసం సాగింది. పాకిస్థాన్ సైన్యం అధిపతిగా వ్యవహరించిన ముషారఫ్ ఆదివారం దుబాయ్‌లో అమెరికన్ హాస్పిటల్‌లో మృతి చెందారు. పలు అవయవాలు దెబ్బతిని, శారీరక వ్యవస్థ పూర్తిగా క్షీణించిన దశలో ముషారఫ్ పరాయి దేశంలో ప్రవాసజీవితంలో ఉన్నప్పుడే కన్నుమూయాల్సి వచ్చింది. ఆయనను పాకిస్థాన్‌కు తిరిగి అనుమతించాలని కుటుంబ సభ్యులు పలుమార్లు కోరారు. అయితే పలు కారణాలతో ఇది సాధ్యం కాలేదు. ఇప్పుడు ఆయన భౌతికకాయాన్ని అంత్యక్రియలకు, ఖననానికి పాకిస్థాన్‌కు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు జరిగాయి. ఓ ప్రత్యేక విమానాన్ని సోమవారం ఇందుకోసం దుబాయ్‌కు పంపిస్తున్నట్లు సమాచారం ఉందని జియో టీవీ తెలిపింది. ముషారఫ్ అత్యంత తీవ్రమైన అమిలోయిడోసిస్ వ్యాధితో బాధపడుతున్నారు.

పైగా వృద్ధాప్య సమస్యలతో సరైన చికిత్స వీలుకాకుండా పోయింది. శారీరక వ్యవస్థ సక్రమంగా పనిచేయకుండా పోయింది. ముషారఫ్‌కు అత్యంత అరుదైన వ్యాధి రావడానికి కారణం ఆయన పలు అవయవాలలో , కణజాలాలలో పూర్తిగా అత్యంత అసాధారణ ప్రాణాంతక ప్రోటిన్ చేరుకోవడం వల్లనే అని వైద్యులు నిర్థారించారు. 2007వ సంవత్సరంలో బెనజీర్ భుట్టో హత్య ఘటన తరువాత ఆయనపై అభియోగాలు వచ్చాయి. దీనితో ఆయన విచారణకు హాజరు కాకుండా గత ఎనిమిది సంవత్సరాలుగా దుబాయ్‌లోనే జీవిస్తున్నారు. తన శేషజీవితం పాకిస్థాన్‌లోనే సాగాలని ఆయన తరచూ పలు ఇంటర్వూల్లో ఆకాంక్షించారు. ఎప్పటికైనా పాకిస్థాన్‌కు తిరిగి వెళ్లుతానని చెపుతూ వచ్చారు. అయితే ఈ కల నెరవేరలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News