జైపూర్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ పహాడియా బుధవారం కరోనా వైరస్ కారణంగా కన్నుమూశారు. 89 సంవత్సరాల పహాడియా 1980-81 కాలంలో రాజస్థాన్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన హర్యానా, బీహార్ రాష్ట్రాలకు గవర్నర్‌గా కూడా పనిచేశారు.
పహాడియా మృతి పట్ల రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కొవిడ్ వైరస్‌తో మరణించిన పహాడియా తన పట్ల మొదటి నుంచి ఎంతో ఆదరాభిమానాలు కనబరిచేవారని గెహ్లాట్ ట్వీట్ చేశారు. పహాడిమా మృతితో తాను వ్యక్తిగతంగా ఎంతో కోల్పోయానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పహాడియా మృతికి సంతాపసూచకంగా గురువారం ఒకరోజు ప్రభుత్వ కార్యాలయాలను మూసివేసి జాతీయ పతాకాన్ని అవనతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గురువారం మధ్యాహ్నం రాష్ట్ర క్యాబినెట్ సమావేశమై పహాడియా మృతి పట్ల సంతాపం ప్రకటించింది. నాలుగు పర్యాయాలు లోక్‌సభ సభ్యునిగా, రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యునిగా, నాలుగు పర్యాయాలు రాజస్థాన్ శాసనసభ్యునిగా, కేంద్ర సహాయ మంత్రిగా జగన్నాథ్ పహాడియా పనిచేశారు. 1988-89లో ఎఐసిసి ప్రధాన కార్యదర్శిగా కూడా ఆయన పనిచేశారు.
Former Rajasthan CM Jagannath Pahadia Passed away