మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోనే సంచలనం కలిగించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్‌ఐబి మాజీ చీఫ్ ప్రభాకరరావు పోలీసులకు రాసిన లేఖ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జూన్ 23న ఆయన జూబ్లీహి ల్స్ పోలీసులకు లేఖ రాశారు. జూన్ 26న తాను ఇండియాకు రావాల్సి ఉందని, కానీ ఆరోగ్యం బాగా లేకపోవడంతో అమెరిలో ఉండిపోవాల్సి వచ్చిందని ఆయన లేఖలో పేర్కొన్నారు. ’క్యాన్సర్‌తో పాటు గుండె సంబంధమైన వ్యాధులతో బాధపడు తున్నాను.
అమెరికా వైద్యుల సూచన మేరకు అక్కడే ఉండి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాను. ఈ కేసుకు నాకు ఎలాంటి సంబం ధంలేదు. నాపై పూర్తి అసత్యమైన ఆరోపణలు చేస్తున్నారు. నేను ఎక్కడ కూడా ఇల్లీగల్ పనులు చేయలేదు. పోలీసులకు ఈ దర్యాప్తులో సహకరించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. నేను ఇండియాకు వచ్చే వరకూ టెలికాన్ఫరెన్స్ లేదా మెయి ల్ ద్వారా పూర్తి సమాచారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నాను. నేను క్రమశిక్షణ గల ఓ పోలీ సు అధికారిని. ఎక్కడికీ తప్పించుకుపోయే పారిపోయే పరిస్థితి లేదు. విచారణ ఎదుర్కొంటాను.
నా ఆరోగ్యం కుదుటపడిన తర్వాత నేనే ఇండియాకు వస్తాను. గతంలో కూడా పలుమార్లు ఉన్నతాధికారులకు విషయాన్ని వాట్సాప్ కాల్ ద్వారా చెప్పాను. నా దృష్టికి వచ్చిన సమాచారాన్ని మొత్తం కూడా విచారణ అధికారికి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను.’ అని లేఖలో వివరించారు. తనకు గతంలో ఉన్న మలిగ్నెంట్ క్యాన్సర్‌తో పాటు ఇప్పుడు బిపి పెరిగిందని ప్రభాకరరావు లేఖలో వెల్లడించారు. తనపై అసత్య ఆరోపణలు చేస్తూ మీడియాకు లీకు లిస్తున్నారని, దీని వల్ల తాను, తన కుటుంబం మానసికంగా ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. ఓ పోలీస్ అధికారిగా తాను ఎలాంటి తప్పూ చేయలేదని, చట్టపరంగా విచారణ జపించాలని కోరారు. ఆరోగ్య సమస్యల నుంచి పూర్తిగా కోలుకున్నాక పోలీసుల ముందు హాజరై అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతానని లేఖలో స్పష్టం చేశారు.
కాగా, బిఆర్‌ఎస్ హయాంలో అనధికారికంగా రాజకీయ నేతలు, పలువురు ప్రము ఖులు, కొందరు ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లను ట్యాప్ చేశారని ఆరోపణలున్నాయి. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే ట్యాపింగ్‌కు సంబంధించిన ఆధారాలు ధ్వంసం చేశారనే అభియోగాల నేపథ్యం లో ప్రభుత్వం ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఈ కేసులో ఎస్‌ఐబి మాజీ అధికారులు ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఎస్‌ఐబి మాజీ చీఫ్ ప్రభాకరరావుపైనా ఇప్పటికే నాన్ బెయిలబుల్ పిటి వారెంట్ జారీ అయ్యిం ది. ఇటీవలే ఈ కేసుకు సంబంధించి నిందితులకు కోర్టు బెయిల్ నిరాకరించింది. కేసు విచారణలో ఉండగానే పలు సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ అంశంపై పూర్తి స్థాయిలో సిట్ విచారణ కొనసాగుతోంది.