Monday, January 20, 2025

మత సామరస్యంలో తెలంగాణను చూసి నేర్చుకోండి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: గత ఏడాది శ్రీరామనవమి, హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా హిందువులు, ముస్లింల మధ్య శాంతి సుహృద్భావాలు కొనసాగేలా చూసినందుకు తెలంగాణ ప్రభుత్వాన్ని ముఖ్యంగా పోలీసులను, రాష్ట్ర హైకోర్టును సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రోహింగ్టన్ నారిమన్ ప్రశంసించారు. 2022 ఏప్రిల్‌లో వివిధ రాష్ట్రాల్లో చోటు చేసుకున్న హింసాకాండపై ‘ రూట్స్ ఆఫ్ రాత్’(Roots of Wrath) పేరిట ‘సిటిజన్స్ అండ్ లాయర్స్ ఇనిషియేటివ్’ అనే స్వచ్ఛంద సంస్థ రూపొందించిన నివేదిక ముందుమాటలో నారిమన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, ‘భారతీయ ముస్లిం’ల గురించి వివిధ రాష్ట్రాల పోలీసు బలగాలను అత్యవసరంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతయినా ఉందని కూడా ఆయన ఆ ముందుమాటలో పేర్కొన్నారు. ‘ రాజ్యాంగ పీఠిక, రాజ్యాంగంలోని ప్రాథమిక విధులకు సంబంధించిన అధ్యాయంలో పేర్కొన్నట్లుగా ఈ రాజ్యాంగ విధులు, పౌరుల ప్రాథమిక విధుల గురించి దేశంలోని అన్ని రాష్ట్రాల పోలీసు బలగాలకు అవగాహన కల్పించడం ప్రాథమికంగా చాలా ముఖ్యం. భారత దేశంలో ఉండే ముస్లింలు భారతీయులనే విషయాన్ని వాళ్లకు తెలియజేయడం ద్వారా ఈ పని చేయాలి’ అని నారిమన్ ఆ ముందుమాటలో పేర్కొన్నారు.

శ్రీరామనవమి, హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా దేశంలోని తొమ్మిది రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చోటు చేసుకున్న అల్లరిమూకల చర్యలు, హింసాకాండను ఆ నివేదికలో వివరంగా పేర్కొన్నారు.‘ కనీసం మూడు రాష్ట్రాలు గుజరాత్, జార్ఖండ్, మధ్యప్రదేశ్‌లలో ఈ ఊరేగింపుల సందర్భంగా మైనారిటీ వర్గాలకు చెందిన వారు కనీసం వంద మంది గాయపడగా, ఇద్దరు మృతి చెందినటుఅర్థమవుతోంది’ అని సుప్రీంకోర్టు నివృత్త న్యాయమూర్తి పేర్కొన్నారు. భారతీయ ముస్లింలు వేరే జాతికి చెందిన ప్రజలు కాదని, దేశంలోని మిగతా వాళ్లలాగే వారు కూడా భారతీయులేనని ఆయన నొక్కి చెప్పారు.‘ ఒక సారి ఈ ప్రాథమిక వాస్తవాన్ని అన్ని రాష్ట్రాల పోలీసు బలగాలహృదయాల్లోకి చొప్పించ గలిగితే పరిస్థితులు ఎంతగానో మెరుపడతాయి. అంతేకాదు అన్ని రాష్ట్రాల్లో పోలీసుల పనితీరులో రాజకీయ జోక్యాన్ని ఆపడానికిదో ఒక మార్గాన్ని కనుగొని తీరాలి. సోదరభావాన్ని సాధించడానికి ప్రయాణించాల్సిన సుదీర్ఘమైన, కఠినమైన మార్గంలో ఇది కొత్త ఆరంభం కావాలి. అది మాత్రమే ప్రతి పౌరుడి ఆత్మగౌరవాన్ని కాపాడగలుగుతుంది’ అని నారిమన్ తన ముందు మాటలో పేర్కొన్నారు.

భారత దేశం ప్రజాస్వామిక, లౌకిక విధానాన్ని ఎంచుకుని బ్రిటీష్ పాలకుల విభజించి పాలించు విధానాన్ని తిరస్కరించిందనే విషయాన్ని నారిమన్ గుర్తు చేశారు.‘ ప్రభుత్వాలు ఏ మతానికి చెందిన వారికీ అనుకూలంగా కాకుండా తటస్థమైన రీతిలో శాంతిభద్రతలను కాపాడాలి. భావప్రకటనా స్వేచ్ఛ ఒక్కటే ప్రజాస్వామ్య మార్గంలో ప్రభుత్వ మార్పిడికి దారితీస్తుందని కూడా దాని అర్థం. వీటన్నిటికీ మించి సోదర భావం యొక్క సుహృద్భావ విలువ, వ్యక్తిగౌరవాన్ని, దేశ సమైక్యత, సమగ్రతలను భారత రాజ్యాంగంలోని పీఠికలో ప్రధానంగా పేర్కొనడం జరిగింది’ అని జస్టిస్ నారిమన్ తన ముందుమాటలో పేర్కొన్నారు.

శాంతిభద్రతలే ముఖ్యమన్న తెలంగాణ పోలీసులు

కాగా శాంతి సామరస్యాలకు ఎలాంటి భంగం కలగకుండా ఇతర మతాలకు చెందిన వారికి ఎలాంటి ఇబ్బందీ కలగకుండా హిందువులు తమ మతానికి చెందిన ఊరేగింపులను నిర్వహించుకునే హక్కును ఎలా కాపాడవచ్చో తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు, రాష్ట్ర హైకోర్టు ఇతర రాష్ట్రాలకు తెలియజేశారని ఆ నివేదిక ప్రశంసించింది. గత ఏడాది ఏప్రిల్‌లో హైదరాబాద్ నగరంలో కానీ, నగరానికి 200 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న భైంసా పట్టణంలో కానీ శ్రీరామనవమి శోభాయాత్రలు సున్నితమైన ప్రాంతాలగుండా వెళ్లడానికి అనుమతించకపోవడమే కాకుండా వివిధ సంఘాలు వేర్వేరుగా ఊరేగింపులు నిర్వహించడానికి కూడా రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు అనుమతించలేదు.

దీన్ని పలు సంఘాలు రాష్ట్ర హైకోర్టులో సవాలు చేశాయి కూడా. అక్కడ జరిగిన వాదోపవాదాల సందర్భంగా కూడా రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు శాంతిభద్రతలను కాపాడడమే తమ కర్తవ్యమని, తాము నిర్దేశించిన రూట్‌మ్యాప్ మార్గంలోనే నిర్వాహకులు శోభాయాత్ర నిర్వహించుకోవాలని స్పష్టం చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి సైతం పోలీసుల వాదనలకే మద్దతు పలకడంతో శోభాయాత్ర ప్రశాంతంగా సాగింది. అదే సంప్రదాయం ఈ ఏడాది కూడా కొనసాగింది. ఇటీవల శ్రీరామనవమి శోభాయాత్రల సందర్భంగా పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున హింసాకాండ చెలరేగిన నేపథ్యంలో నారిమన్ చేసిన వ్యాఖ్యలు వివిధ రాష్ట్రాల పోలీసులకు ఓ హెచ్చరిక కావాల్సిన అవసరం ఎంతయినా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News