Sunday, January 19, 2025

మాజీ డిసిపి మరో మాయ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ డిసిపి రాధాకిషన్ రావు మరో వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా పీటీ వారెంట్ పై పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఓ ల్యాండ్ వ్యవహారంలో వ్యాపారవేత్తను బెదిరించినందుకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. కంపెనీ వ్యవహారంలో రాధాకిషన్ రావు జోక్యం చేసుకుని సెటిల్మెంట్ చేశారని, రూ. 150 కోట్ల కంపెనీని తక్కువ ధరకే మరొకరికి ఇప్పించారని రాధాకిషన్ రావు పై ఓ వ్యాపారవేత్త ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఇవాళ పీటీ వారెంట్ కింద అదుపులోకి తీసుకుని నాంపల్లి కోర్టులో హాజరు పరిచి అదుపులోకి తీసుకున్నారు.

కిడ్నాప్ చేసి క్రియా హెల్త్ కేర్ సంస్థలో రూ.కోట్ల విలువైన తన షేర్లను నలుగురు డైరెక్టర్ల మీదకు బలవంతంగా బదిలీ చేయించారని ఆ సంస్థ వ్యవస్థాపకుడు చెన్నుపాటి వేణుమాధవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు ఈ ఏడాది ఏప్రిల్‌లో కేసు నమోదు చేశారు. రాధాకిషన్ రావుతో పాటు మరో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు సహా చంద్రశేఖర్ వేగె, కృష్ణ, గోపాల్, రాజ్, రవి, బాలాజీలపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో పరారీలో ఉన్న నిందితుల కోసం జూబ్లీహిల్స్ పోలీసులు లుక్ అవుట్ నోటీస్ జారీ చేశారు. హైదరాబాద్‌కు చెందిన చెన్నుపాటి వేణుమాధవ్ హార్వర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసి, ప్రపంచ బ్యాంకులో పని చేశారు. భారత్‌కు తిరిగొచ్చి 2011లో క్రియా హెల్త్ కేర్ సంస్థను ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ఖమ్మం జిల్లాలో టెలీ మెడిసిన్, జాతీయ రహదారి అత్యవసర వాహనాల సేవలు అందించే ఈ సంస్థ మొత్తం దాదాపు రూ.250 కోట్ల విలువైన ప్రాజెక్టులు చేపట్టింది.

ఈ సంస్థలో ఇద్దరు శాశ్వత డైరెక్టర్లు వేణు, బాలాజీ, నలుగురు తాత్కాలిక డైరెక్టర్లుగా గోపాల్, రాజ్, నవీన్, రవి ఉన్నారు. సంస్థకు బాలాజీ సీఈవోగా వ్యవహరిస్తున్నారు. 2016-17 నాటికి సంస్థలో వేణు -60, బాలాజీ -20, గోపాల్- 10, రాజ్ -10 శాతం చొప్పున వాటాలతో షేర్ హోల్డర్లుగా ఉన్నారు. 2018లో నలుగురు తాత్కాలిక డైరెక్టర్లు గోపాల్, రాజ్, నవీన్, రవి కలిసి వేణు పేరిట ఉన్న 60 శాతం షేర్లను తక్కువ ధరకు విక్రయించాలని, సంస్థను పూర్తిగా తామే నడిపించుకుంటామని ఒత్తిడి చేశారు. ఇదే సమయంలో గోల్డ్‌ఫ్ అబోడే ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సీఈవో చంద్రశేఖర్ వేగె పరిచయమవ్వగా, తాత్కాలిక డైరెక్టర్లు షేర్లు విక్రయించాలంటూ ఒత్తిడి తెస్తున్న విషయాన్ని వేణు అతనితో ప్రస్తావించారు. క్రియా సంస్థలో తాను షేర్ హోల్డర్‌గా మారితే నలుగురు తాత్కాలిక డైరెక్టర్లతో బేరసారాలు నడిపేందుకు అవకాశం ఉంటుందని చంద్రశేఖర్ వేగె వేణుకు చెప్పాడు. ఇందుకు అంగీకరించిన వేణుమాధవ్, మొత్తం రూ.40 కోట్ల విలువ చేసే 4 లక్షల షేర్లను చంద్రశేఖర్ పేరిట బదిలీ చేశాడు.

ఆ తర్వాత చంద్రశేఖర్ ప్లేటు ఫిరాయించి తాత్కాలిక డైరెక్టర్లతోనూ ఇదే తరహాలో ఒప్పందం చేసుకున్నట్లు ఫిర్యాదులో వేణుమాధవ్ పేర్కొన్నారు. నలుగురు తాత్కాలిక డైరెక్టర్ల వేధింపులు ఎక్కువవడంతో 2018 అక్టోబరు 3న బంజారాహిల్స్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశానని వేణుమాధవ్ పేర్కొన్నారు. కొన్ని రోజుల తర్వాత షేర్లు బదలాయించడం లేదని ఆరోపిస్తూ అక్టోబర్‌లో తాత్కాలిక డైరెక్టర్లు కూడా అతనిపై ఫిర్యాదు చేశారు. తొలుత తాను ఇచ్చిన ఫిర్యాదు పట్టించుకోకపోవడంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశానన్నారు. ఆ తర్వాత చంద్రశేఖర్, గోపాల్, రాజ్, నవీన్, రవి తదితరులు అప్పటి టాస్క్‌ఫోర్స్ డిసిపి రాధాకిషన్‌తో కలిసి బలవంతంగా షేర్లు బదిలీ చేయించుకోవాలని పథకం వేశారని ఆయన ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 2018 నవంబరు 22న ఉదయం ఖాజాగూడ దగ్గర ద్విచక్రవాహనాలపై వచ్చిన ముగ్గురు అడ్డగించి తాము టాస్క్‌ఫోర్స్ పోలీసులమని దాడి చేస్తూ బలవంతంగా టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి తీసుకెళ్లారని,

ఎస్‌ఐ మల్లికార్జున్ వేణును ఇన్‌స్పెక్టర్ గట్టు మల్లు కార్యాలయంలో ఉంచారని తెలిపారు. అప్పటికే చంద్రశేఖర్, గోపాల్, రాజశేఖర్, కృష్ణ, పూర్ణ చందర్‌రావు, బాలాజీ అక్కడికి చేరుకున్నారని, రూ.100 కోట్ల విలువైన కంపెనీ వాటాను చట్టవిరుద్ధంగా బదిలీ చేయాలని బెదిరించడం దారుణమని వారికి చెప్పానన్నారు. గట్టుమల్లు ఆదేశాలతో ఎస్‌ఐ మల్లికార్జున్ నకిలీ కరెన్సీ కేసులో తీసుకొచ్చిన నిందితుల్ని చితకబాది, తాము చెప్పినట్లు వినకపోతే ఇదే పరిస్థితి తనకూ వస్తుందంటూ బెదిరించారని పేర్కొన్నారు. డిసిపి రాధాకిషన్ రావు వచ్చాక చంద్రశేఖర్ వేగె జోక్యం చేసుకుని డిసిపి చెప్పినట్లు విని డీల్ ముగించాలని సూచించాడని, డీల్‌కు అంగీకరించాలని, ఇంకా ప్రాణాలతో ఉన్నందుకు అదృష్టవంతుడివంటూ తాత్కాలిక డైరెక్టర్లు బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అదే సమయంలో తన లాయర్ శ్రీనివాస్, స్నేహితుడైన లహరి రిసార్టు యజమాని సంజయ్‌కి కిడ్నాప్ చేసినట్లు సమాచారమిచ్చాడని తెలిపారు. సంజయ్ డిజిపి కార్యాలయానికి వెళ్లి సమాచారం ఇచ్చాడని, డిజిపి ఆఫీసు నుంచి ఇన్‌స్పెక్టర్ గట్టు మల్లుకు కాల్ రాగా,

రాధాకిషన్ రావు మాట్లాడి తనకు పైస్థాయి నుంచి ఆదేశాలు వచ్చాయని బదులిచ్చాడని తెలిపారు. మనీ లాండరింగ్, టెర్రరిజం ఆరోపణలు ఉన్నట్లు చెప్పాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. బయటి నుంచి ఎలాంటి సహకారం ఉండదని, ఒప్పందం చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలని రాధాకిషన్‌రావు సూచించాడని, ఒప్పందం చేసుకోకపోతే తప్పుడు ఆరోపణలతో మరిన్ని కేసులు పెట్టిస్తామని తాత్కాలిక డైరెక్టర్లు బెదిరించారన్నారు. తుపాకులు, కర్రలతో బెదిరిస్తూ షేర్లు బదలాయించే ఒప్పందంపై తనతో బలవంతంగా సంతకం చేయించి వదిలేశారని తెలిపాడు. ఈ విషయంపై మీడియా, కోర్టులు, ఇతరులకు సమాచారం ఇస్తే చావు ఎదుర్కోవాల్సి వస్తుందని రాధాకిషన్ రావు బెదిరించాడని, అనంతరం గట్టు మల్లు, ఎస్‌ఐ బృందానికి రూ.10 లక్షలు ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. కిడ్నాప్ చేయించి వాటాలు బదిలీ చేయించే వ్యవహారంలో చంద్రశేఖర్, నలుగురు తాత్కాలిక డైరెక్టర్ల నుంచి అదనంగా రూ.10 కోట్లు తీసుకున్నాడని ఫిర్యాదులో వెల్లడించారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డిసిపి రాధాకిషన్ రావుది కీలక పాత్ర
కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డిసిపి రాధాకిషన్ రావుది కీలక పాత్ర అని పోలీసుల విచారణలో వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించిన కీలకమైన డేటా ధ్వంసం కుట్రలోనూ ఆయన పాత్ర ఉందని పోలీసులు వెల్లడించారు. ప్రైవేటు వ్యక్తుల ప్రొఫైల్లను ఉపయోగిచిన ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారు. ఈ సమాచారం బయటకు వస్తే ఎక్కడ తమ భండారం బయటపడుతుందనే భయంతోనే రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు, భుజంగరావు తిరుపతన్నతో కలిసి డేటాను ధ్వంసం చేసినట్లు దర్యాప్తు బృందం ఇదివరకే గుర్తించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News