అత్యాచారం కేసులో గోవా కోర్టు తీర్పు
ముగిసిన ఏడున్నరేళ్ల సుదీర్ఘ నిరీక్షణ
పనాజి: అత్యాచారం కేసులో తెహల్క మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ నిర్దోషిగా బయటపడ్డారు. ఆయన నిర్దోషి అని శుక్రవారం గోవా కోర్టు చెప్పింది. 2013లో థింక్‌ఇన్ గోవా సమావేశం సందర్భంగా ఓ హోటల్ లిఫ్టులో తనను తరుణ్ తేజ్‌పాల్ లైంగికంగా వేధించాడని ‘తెహల్క డాట్‌కామ్’కు చెందిన మహిళా జర్నలిస్టు ఫిర్యాదు చేసింది. అదే ఏడాది నవంబర్ 30న ఆయనను అరెస్టు చేశారు. దీనిపై గోవా కోర్టు విచారణ చేపట్టింది. ఆరోపణలపై తేజ్‌పాల్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. తనపై చేసిన ఆరోపణలు తప్పుడు ఆరోపణలని, కేసును కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ కోసం కూడా విజ్ఞప్తి చేశారు. పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు 2014 జూలై 1న బెయిల్ మంజూరు చేసింది. తదనంతరం తనపై ఆరోపణలను కొట్టివేయాలని, కేసు రద్దు చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను మాత్రం సుప్రీంకోర్టు కొట్టివేసింది.
దీంతో గోవా కోర్టులో విచారణ జరిగి చివరికి శుక్రవారం తీర్పు వెలువడింది. అదనపు సెషన్స్ జడ్జి క్షమా జోషి తీర్పు ప్రకటించే సమయంలో తేజ్‌పాల్ తన కుటుంబ సభ్యులతో కోర్టులోనే ఉన్నారు. ఏడున్నరేళ్ల తర్వాత తీర్పు వెలువడడంపై తేజ్‌పాల్ కుమార్తె కారా తేజ్‌పాల్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తన న్యాయవాది దివంగత రాజీవ్ గోమెజ్‌కు తేజ్‌పాల్ కృతజ్ఞతలు తెలిపారు. గోమెజ్ కరోనా సోకడంతో ఇటీవల మృతి చెందారు. కాగా తీర్పు తర్వాత దీనిపై హైకోర్టులో అపీలు చేస్తామని ప్రబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫ్రాన్సిస్ టవేరా మీడియాకు చెప్పారు.