గౌహతి: కాంగ్రెస్ కు మరో ఎదురుదెబ్బ తగిలినట్లయింది. అస్సాం కాంగ్రెస్ కు పార్టీ ఎంఎల్ఏ భరత్ చంద్ర నారా సోమవారం రాజీనామా చేశారు. నవోబోయిచ ఎంఎల్ఏ అయిన ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపారు. ‘‘ నేను నేషనల్ కాంగ్రెస్ కు ఉన్నపళంగా రాజీనామా చేస్తున్నాను’’ అని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. తన భార్య రాణి నారాకు లోక్ సభ టికెట్ ఇవ్వని కారణంగా ఆయన ఈ రాజీనామా చేసినట్టు తెలుస్తోంది.
కాంగ్రెస్ టికెట్ పై భరత్ నారా ఆరుసార్లు అసెంబ్లీకి ఎన్నకయ్యారు. 1985 నుంచి 2011 వరకు ఆయన ధకువాఖనా నియోజకవర్గం నుంచి నిరంతరం గెలుస్తూ వచ్చారు. అంతేకాక ఆయన అస్సాం క్యాబినెట్ మంత్రిగా కూడా పనిచేశారు. 2021లో ఆయన లక్ష్మిపూర్ జిల్లాలోని నవోబోయిచకు మారారు. కాంగ్రెస్ టికెట్ పై మళ్లీ గెలిచారు. ఆయన భార్య రాణి నారా ప్రస్తుతం అస్సాంలోని లక్ష్మిపూర్ స్థానానికి గట్టిపోటీదారుగా ఉన్నారు. ఆమె ఈ లోక్ సభ స్థానం నుంచి మూడుసార్లు గెలిచారు. ఒకసారి రాజ్యసభకు కూడా ఎన్నికయ్యారు. కాగా కాంగ్రెస్ ఈ సారి టికెట్ ను రాణి నారాకు ఇవ్వకుండా ఉదయ్ శంకర్ హజారికాకు ఇచ్చింది. ఆయన బిజెపి నుంచి గత ఏడాది డిసెంబర్ లో కాంగ్రెస్ లోకి పార్టీ మారారు.