బిజెపి నేత, మాజీ కేంద్ర మంత్రి దేవేంద్ర ప్రధాన్(84) సోమవారం కన్నుమూశారు. ఆయన అటల్ బిహారీ వాజ్‌పేయి హయాం ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఆయన మూడుసార్లు ఒడిశా బిజెపి అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రధాన్‌కు ఇద్దరు కుమారులు. న్యూఢిల్లీలోని తీన్‌మూర్తి వీధిలోని తన కుమారుడి అధికార నివాసంలో ఆయన చివరి శ్వాసను వదిలారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన కుటుంబ సభ్యులకు తన సంతాపాన్ని తెలిపారు. కాగా ప్రధాని నరేంద్ర మోడీ, దేవేంద్ర ప్రధాన్ మృతదేహానికి పుష్పాంజలి ఘటించి, ఆయన ఒడిశాలో బిజెపి బలపడ్డానికి ఎంతో కృషిచేశారని కీర్తించారు.
అంతేకాక ఆయన ఎంపీగా బాగా కృషి చేసేవారని, దారిద్య్ర నిర్మూలనకు, సామాజిక స్వాధికారతకు పాటుపడ్డారని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలుపుతున్నాను అంటూ ఎక్స్ పోస్ట్ పెట్టారు. తీన్‌మూర్తి లేన్‌లోని ఆయన నివాసానికి అనేక మంది కేంద్ర మంత్రులు వెళ్లి నివాళులర్పించారు. దేవేంద్ర ప్రధాన్ 1998 లోక్‌సభ ఎన్నికల్లో దేవ్‌గఢ్ నుంచి తొలిసారి ఎన్నికయ్యారు. 1999 నుంచి 2001 వరకు కేంద్ర రవాణ, వ్యవసాయ శాఖ మంత్రిగా ఆయన పనిచేశారు. ఒడిశా ప్రగతికి ఆయన ఎంతో పాటుపడ్డారని గవర్నర్ హరిబాబు కంభంపాటి కీర్తించారు. ఆయన మృతదేహాన్ని సాయంత్రం ఢిల్లీ నుంచి భువనేశ్వర్‌కు తీసుకొస్తారని కుటుంబసభ్యులు తెలిపారు.