న్యూఢిల్లీ: మాజీ కేంద్ర మంత్రి, ఆర్‌జెడి నేత శరద్ యాదవ్ గురువారం కన్నుమూశారు. ఆయన వయస్సు 75 ఏళ్లు. ఆయన కుమార్తె సుభాషిణి శరద్ యాదవ్ ట్విట్టర్‌లో ఈ విషయాన్ని ధ్రువీకరించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం ఇటీవల మరింత క్షీణించడంతో గుర్గావ్‌లోని ఫోర్టిస్ ఆస్పత్రిలో చేర్చారు. శరద్ యాదవ్ 1999, 2004 మధ్య అటల్ బిహారీ వాజపేయి మంత్రివర్గంలో పలు శాఖలను నిర్వహించారు.2003లో ఆయన జెడియు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా ఈ పార్టీకి చెందిన వారే. అయితే 2004 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత నితీశ్ కుమార్ ఆయన రాజ్యసభ టికెట్ పొందడంలో సాయం చేశారు.
2009లో ఆయన మళ్లీ మాధేపురనుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అయితే 2014 లోక్‌సభ ఎన్నికల్లో జెడి(యు) ఓటమి తర్వాత నితీశ్ కుమార్‌తో ఆయన సంబంధాలు చెడిపోవడం మొదలైంది. 2017 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్ కుమార్ మళ్లీ బిజెపితో చేతులు కలపాలని నిర్ణయించగా, శరద్ యాదవ్ ఆయన బాటలో నడవడానికి ఇష్టపడలేదు. తర్వాత లోక్‌తాంత్రిక్ జనతాదళ్ పేరిట సొంత పార్టీ పెట్టారు. అయితే 2012లో తన పార్టీ ఆర్‌జెడిలో విలీనమవుతున్నట్లు శరద్ యాదవ్ ప్రకటించారు. శరద్ యాదవ్ మొత్తం 7 సార్లు లోక్‌సభకు, మూడుసార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు.