సిమ్లా: మాజీ కేంద్ర మంత్రి, హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సుఖ్‌రాం బుధవారం తెల్లవారుజామున ఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన వయస్సు 94 సంవత్సరాలు. హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలీలో నివసిస్తున్న సుఖ్‌రాంకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో మే 7న ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్‌కు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన హెలికాప్టర్‌లో తరలించారు. బుధవారం తెల్లవారుజామున 1.30 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. ప్రజల దర్శనార్థం సుఖ్‌రాం భౌతికకాయాన్ని హిమాచల్ ప్రదేశ్‌లోని మండిలోగల సేరి మంచ్‌లో గురువారం ఉంచనున్నట్లు ఆయన మనవడు ఆశ్రయ్ శర్మ తెలిపారు. తన తాతగారి మరణవార్తను తెల్లవారుజామున 2 గంటలకు శర్మ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. సుఖ్‌రాం మృతిపట్ల హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ సంతాపాన్ని ప్రకటించారు.
1993 నుంచి 1996 వరకు అప్పటి కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రిగా(స్వతంత్ర హోదా) సుఖ్‌రాం పనిచేశారు. తన స్వస్థలం మండి నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఆయన ప్రాతినిధ్యం వహించారు. ఐదుసార్లు హిమాచల్ ప్రదేశ్ శాసనసభకు, మూడు సార్లు లోక్‌సభకు ఆయన ఎన్నికయ్యారు. కమ్యూనికేషన్ల మంత్రిగా ఉన్న కాలంలో అవినీతికి పాల్పడినందుకు 2011లో సుఖ్‌రాంకు ఐదేళ్ల జైలు శిక్ష పడింది. ఆయన కుమారుడు అనిల్ శర్మ ప్రస్తుతం మండి నుంచి బిజెపి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. సినీ నటుడైన సుఖ్‌రాం మనవడు ఆయుష్ శర్మ బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ సోదరి అర్పితను వివాహం చేసుకున్నారు.