Friday, November 22, 2024

రెజ్లింగ్‌కు బ్రిజ్ భూషణ్ గుడ్‌బై!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్లూఎఫ్‌ఐ) కొత్త కార్యవర్గంపై కేంద్ర ప్రభుత్వం వేటు వేసిన నేపథ్యంలో డబ్లూఎఫ్‌ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కీలక ప్రకటన చేశారు. రెజ్లింగ్ వ్యవహారాల నుంచి తాను రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు ఆదివారం వెల్లడించారు. కొత్తగా ఎన్నికైన ప్యానెల్ రెజ్లింగ్ వ్యవహారాలను చూసుకుంటుందని, దీనిలో తన జోక్యం ఉండదని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికలతో పాటు అనేక బాధ్యతలు తనపై ఉన్నాయని, ఇలాంటి స్థితిలో తాను రెజ్లింగ్ సమాఖ్య కార్యకలాపాలను పర్యవేక్షించలేనని బ్రిజ్‌భూషణ్ పేర్కొన్నారు.

భాజాపా జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాతో సమావేశమైన అనంతరం బ్రిజ్‌భూషణ్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఇదే సమయంలో రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్టు వెల్లడించారు. అన్ని ఆలోచించే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని, దీనిలో ఎలాంటి ఒత్తిడి లేదని వివరించారు. 12 ఏళ్ల పాటు రెజ్లింగ్‌కు సేవలు అందించానని, అది మంచో, చెడో..కాలమే సమాధానం చెబుతుందన్నారు. ప్రస్తుతం తాను రెజ్లింగ్ నుంచి పూర్తిగా తప్పుకుంటున్నానని, ఇకపై సమాఖ్యలో తన జోక్యం ఉండదన్నారు. కొత్తగా ఎన్నికైన ప్యానెల్‌తో తనకు ఎలాంటి సంబంధం ఉండదని స్పష్టం చేశారు. ఇకపై క్రీడా రాజకీయాలకు తాను దూరంగా ఉంటానని బ్రిజ్‌భూషణ్ వివరించారు.

కొత్త ప్యానెల్‌పై కేంద్రం వేటు
ఇటీవల జరిగిన ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్లూఎఫ్‌ఐ) కొత్త ప్యానెల్‌పై కేంద్ర ప్రభుత్వం వేటు వేసింది. కొత్త ప్యానెల్‌ను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆదివారం సస్పెండ్ చేసింది. డిసెంబర్ 21 జరిగిన రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికల్లో బ్రిజ్‌భూషణ్‌కు సన్నిహితంగా ఉండే సంజయ్ సింగ్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల ఫలితాన్ని నిరసిస్తూ భారత స్టార్ మహిళా రెజ్లర్, ఒలింపిక్ పతక విజేత సాక్షి మలిక్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించింది. అంతేగాక స్టార్ రెజ్లర్ భజరంగ్ పునియా, పారా రెజ్లర్ వీరేందర్ సింగ్ తమకు లభించిన పద్మశ్రీ పురస్కారాలను వెనక్కి ఇచ్చేస్తున్నట్టు ప్రకటించారు. ఇది దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

తాజాగ కొత్తగా ఎన్నికైన ప్యానెల్ అండర్15, అండర్20 జాతీయ రెజ్లింగ్ పోటీలను హడావిడిగా నిర్వహించాలని నిర్ణయించింది. దీన్ని తప్పుపట్టిన కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ కొత్త ప్యానెల్‌పై నిషేధం విధించింది. ఇదిలావుంటే సమాఖ్య వ్యవహారాల పర్యవేక్షణ కోసం తాత్కాలిక ప్యానెల్‌ను ఏర్పాటు చేయాలని భారత ఒలింపిక్ సంఘాన్ని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ సూచించింది. మరోవైపు రెజ్లింగ్ సమాఖ్యపై కేంద్ర వేటు వేయడాన్ని పలువురు రెజ్లర్లు స్వాగతించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News