బెంగళూరు: హసన్ జిల్లా పంచాయతి మాజీ సభ్యురాలు ఒకరు జెడిఎస్ సిట్టింగ్ ఎంపి, హసన్ లోక్‌సభ అభ్యర్థి ప్రజ్వల్ రేవణ్ణపై సంచలన ఆరోపణలు చేశారు. గడచిన మూడేళ్లుగా తనపై అనేకసార్లు అత్యాచారం జరిపిన ప్రజ్వల్ దాన్ని వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేశారని ఆమె ఆరోపించారు. 44 సంవత్సరాల బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బుధవారం(మే 1) సిఐడి పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం..తాను జెడ్‌పి సభ్యురాలిగా ఉన్న కాలంలో వివిధ అభివృద్ధి పనుల కోసం ఎంపి, ఎమ్మెల్యే ఇంటికి వెళ్లేదానని బాధితురాలు తెలిపారు. 2021లో ఒక రోజు స్థానిక కళాశాలలో చదువుతున్న కొందరు విద్యార్థ్థినులకు హాస్టల్ సీట్లు ఇప్పించడంలో సహాయం కోరేందుకు తాను ప్రజ్వల్ రేవణ్ణను కలిశానని ఆమె తెలిపారు.
మరుసటి రోజు కలవాలని ఆయన చెప్పారని ఆమె తెలిపారు. మరుసటి రోజు తాను ఎంపిని హసన్‌లోని ఆయన కార్యాలయంలో కలిశానని ఆమె చెప్పారు. హాలులో చాలామంది ఉండడంతో మొదటి అంతస్తులో వేచి ఉండాలంటూ అక్కడి సిబ్బంది తనకు చెప్పారని ఆమె తెలిపారు. అక్కడ ఉన్న కొందరు మహిళలతో ప్రజ్వల్ మాట్లాడి వారిని పంపించవేశారని, అప్పుడు తాను ఒక్కదాన్నే మిగిలానని బాధితురాలు చెప్పారు. ఆ తర్వాత ఎంపి తనను గదిలోకి పిలిచారని, తాను వెళ్లానని ఆమె చెప్పారు. తన చేతిని పట్టుకుని లోపలకు లాగేసిన ప్రజ్వల్ తలుపు గడియ పెట్టేశారని ఆమె చెప్పారు. ఏమీ కాదని చెబుతూ తనను మంచంపైన కూర్చోపెట్టారని, నీ భర్త మాటలు తగ్గించుకోవాలని, లేకపోతే తీవ్ర పర్యవసనాలు ఉంటాయని ప్రజ్వల్ తనను బెదిరించారని ఆమె తెలిపారు.
నీ భర్త రాజకీయంగా ఎదగాలంటే తన మాటను వినాలని ప్రజ్వల్ చెప్పారని బాధితురాలు ఆరోపించారు. ఆ తర్వాత తనను మంచంపైన నగ్నంగా పడుకోవాలని ఎంపి చెప్పారని, తాను అందకు నిరాకరించి గట్టిగా రుస్తానని చెప్పానని ఆమె చెప్పారు. తన వద్ద తుపాకీ ఉందని, నిన్ను, నీ భర్తను అంతు చూస్తానని ఆయన బెదిరించారని ఆమె ఆరోపించారు. అనంతరం ప్రజ్వల్ మొబైల్ ఫోన్ తీసి తనపై అత్యారాం జరిపారని ఆమె ఆరోపించారు. తనపైన అత్యాచారం జరిపి, లైంగికంగా దాడి చేసి దాన్నంతా మొబైల్ ఫోన్‌లో రికార్డు చేశారని ఆమె ఆరోపించారు. ఈ విషయాన్ని బయటకు చెబితే వీడియోను లీక్ చేస్తానని బెదిరించారని, తాను అడిగినప్పుడు అక్కడకు రావాలని ఆదేశించారని ఆమె చెప్పారు. ఆ తర్వాత తరచు తనకు వీడియో కాల్ చేసి నగ్నంగా ఉండాలని చెప్పేవారని, అనేక సార్లు తనపై అత్యాచారినిక పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. అతని పట్ల భయంతో తాను ఈ విషయాలు ఎవరికీ చెప్పలేదని, కాని హసన్ లైంగిక వేధింపుల కుంభకోణం బయటపడి కర్నాటక ప్రభుత్వం దర్యాప్తు చేసేందుకు సిట్‌ను ఏర్పాటు చేయడంతో తాను ధైర్యం చేసి బయటకు వచ్చానని బాధితురాలు తెలిపారు.
ప్రజ్వల్ ఐపిసిలోని వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా..ఏప్రిల్ 28న హసన్‌లోని హోలెనరసీపూర్ పోలీసు స్టేషన్‌లో నమోదైన మరో లైంగిక వేధింపుల కేసులో కేసులో తన తండ్రి జెడిఎస్ ఎమ్మెల్యే హెచ్‌డి రేవణ్ణతోపాటు ప్రజ్వల్ కూడా నిందితుడిగా ఉన్నారు. ఇదిలా ఉండగా ముందస్తు జామీను కోరుతూ ఎంపి/ఎమ్మెల్యే కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను ఎమ్మెల్యే రేవణ్ణ శుక్రవారం ఉపసంహరించుకున్నారు. రేవణ్ణపై అత్యాచారం కేసు నమోదు చేయలేదని, ఆయనపై నమోదైన నేరాలన్నీ బెయిల్ పొందగలవేనని సిట్ తెలియచేయడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా..ప్రజ్వల్ చేతిలో లైఔంగిక దాడికి గురైన బాధితురాలిని కిడ్నాప్ చేసినందుకు ఎమ్మెల్యే రేవణ్ణతోపాటు మరో వ్యక్తిపై మైసూరులోని కెఆర్ నగర్ పోలీసు స్టేషన్‌లో మే 2న(గురువారం) మరో కేసు నమోదైంది.