మనతెలంగాణ/హైదరాబాద్ : ఫార్ములా -ఇకారు రేసింగ్ ఈవెంట్ హుస్సేన్ సాగర్ రూపురేఖలను మార్చేస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక క్రీడల్లో ఒకటైన కార్ల రేసింగ్ ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంగా జరుగుతుండడంతో దానికి అనుగుణంగానే ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తోంది. హుస్సేన్‌సాగర్ తీరంలోని లుంబినీ పార్కు, సచివాలయం, ఎన్టీఆర్ ఘాట్, ఎన్టీఆర్ గార్డెన్, ఐమ్యాక్స్, నెక్లెస్ రోడ్డును చుట్టు ముట్టేస్తూ నిర్మిస్తున్న ఫార్ములా –ఇకారు రేసింగ్ మార్గం సరికొత్త ఆకర్షణగా మారుతోంది. ఇప్పటికే ట్రాక్ నిర్మాణానికి సంబంధించిన పనులు పూర్తయ్యాయి. ఒకేసారి ప్రపంచంలోని 13 దేశాల్లోని ముఖ్య నగరాల్లో జరుగుతున్న ఫార్ములా -ఈ కార్ రేసింగ్ హైదరాబాద్‌లోనూ వచ్చే ఏడాది ఫిబ్రవరి11న జరగనుంది.
ఎఫ్‌ఐఎ పర్యవేక్షణలో…
ప్రపంచ వ్యాప్తంగా జరిగే కార్ రేసింగ్ పోటీల నిర్వహణలో ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ ఫెడరేషన్ (ఎఫ్‌ఐఏ) సంస్థ ఫార్ములా -ఇకారు రేసింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. అత్యంత వేగంగా దూసుకువెళ్లే మోటార్ కార్లను దృష్టి పెట్టుకొని నిర్ధేశిత మార్గాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫార్ములా –ఇకారు ట్రాక్‌కు మాత్రమే కాకుండా ఆ చుట్టు పక్కల ఉన్న ప్రాంతాలను అత్యాధునిక శైలిలో తీర్చిదిద్దుతున్నారు. ముఖ్యంగా ఐమ్యాక్స్ పక్కన ఉన్న సుమారు 11 ఎకరాల స్థలాన్ని సైతం ఫార్ములా -ఈ ట్రాక్ నిర్మాణానికి, ఆ తర్వాత పోటీలు నిర్వహించే సమయంలో వినియోగించుకునేందుకు వీలుగా తీర్చిదిద్దుతున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన అధికారుల కమిటీ అహర్నిశలు శ్రమిస్తోంది.
మరో నాలుగేళ్ల పాటు ఫార్ములా ఇకారు రేసింగ్ పోటీలు
భారతదేశంలో తొలిసారిగా జరుగుతున్న కారు రేసింగ్ పోటీలకు హైదరాబాద్‌ను వచ్చే ఏడాది ఫిబ్రవరితో పాటు వరుసగా మరో నాలుగేళ్ల పాటు ఫార్ములా- ఈ కారు రేసింగ్ పోటీలు నిర్వహించేందుకు ఎంపిక చేశారు. దీంతో హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ ప్రపంచ స్థాయిలో ఉండేలా ట్రాక్ నిర్మాణం పనులను, తర్వాత పోటీల సమయంలో చేయాల్సిన ఏర్పాట్లను హెచ్‌ఎండిఏ అధికారులు ప్రతిష్టాత్మకంగా చేపట్టారు.
గంటకు సుమారు 320 కిలో మీటర్ల వేగంతో….
ఈ నెల 19, 20న, డిసెంబర్ 10, 11వ తేదీన ఇండియన్ రేసింగ్ ట్రయల్ రన్ లీగ్ జరుగబోతుంది. రేస్ కార్ల పరుగులు వీక్షించడానికి రేసింగ్ ప్రియులు ఇప్పటికే సిద్ధమయ్యారు. ఈ పోటీల్లో 6 టీమ్‌లు పాల్గొంటుండగా, 2.8 కిలోమీటర్ల పొడవునా ట్రయల్ రేసింగ్ సాగనుంది. ప్రతి టీంలో నలుగురు సభ్యులుండగా అందులో ఇద్దరు అంతర్జాతీయ డ్రైవర్స్ ఉంటారు. గంటకు సుమారు 320 కిలోమీటర్ల వేగంతో కార్లు దూసుకుపోనున్నాయి.
ఈ మార్గం పొడవునా 8 మలుపులు
ఈ రేసింగ్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి ప్రారంభమై సచివాలయం ముందు నుంచి ఎన్టీఆర్ ఘాట్ మీదుగా – ఎన్టీఆర్ గార్డెన్ – ఐమాక్స్ -ఇందిరాగాంధీ రోటరీ నుంచి తిరిగి ఎన్టీఆర్ మార్గ్, లుంబినీ పార్క్ వైపు మళ్లుతుంది. అక్కడి నుంచి తెలుగు తల్లి ఫ్లై ఓవర్ చేరుకుంటుంది. ఈ మార్గం పొడవునా 8 మలుపులు ఉన్నాయి. ఈ రేసింగ్ మార్గంలో 25 ప్రాంతాల్లో మార్షల్ పొజిషన్, ట్రాక్ సిగ్నల్ లైట్స్ ఉంటాయి. మరో మూడు చోట్ల సేఫ్టీ కార్లు, రికవరీ, ఎమర్జెన్సీ వాహనాలు అందుబాటులో ఉంటాయి. రేస్‌లో పాల్గొనే డ్రైవర్ల విశ్రాంతి గదులు, ప్రేక్షకుల గ్యాలరీలను రెడీ అవుతున్నాయి.
సీట్ల వారీగా ధరలు
ఈ రేసింగ్ పండుగను వీక్షించడానికి బుక్ మైషోలో టికెట్లు బుక్ చేసుకోవాలి. స్టాండ్ 1 నుంచి స్టాండ్ 5 వరకు, ప్రీమియం స్టాండ్, గ్రీన్ స్టాండ్ 1,2, పాడాక్ ప్లాటినం, పాడాక్ గోల్డ్‌గా సీటింగ్ ఏర్పాట్లు చేశారు. వీటిలో ఒక్కో సీటింగ్ విభాగానికి ఒక్కో ధర ఉంటుంది. రూ.749 నుంచి 6,999 వరకు టికెట్ ధరలు ఉన్నాయి. పాడాక్ గోల్డ్ ధర రూ.4,999కాగా, పాడాక్ ప్లాటినం సీటింగ్ ధర రూ.6999 ఉంది. స్టాండ్ 1 నుంచి స్టాండ్ 5 వరకు వెయ్యి నుంచి 12 వందల లోపు ధరలు ఉన్నాయి.
షెడ్యూల్ ఇలా..
19 నవంబర్ శనివారం
ఉ.-8:30గం వరకు రేసింగ్ లీగ్‌పై బ్రీఫింగ్
ఉ. 9 నుంచి10గంటల వరకు ఇండియన్ రేసింగ్ లీగ్- ఎఫ్‌పి1
ఉ.11 నుంచి 12 వరకు ఎఫ్‌పి2
మ. 12- నుంచి ఒంటిగంట వరకు లంచ్ బ్రేక్
సా.3:30 నుంచి 3:45 వరకు రేసింగ్ (క్వాలిఫైంగ్)
సా.4నుంచి 4:45 వరకు రేసింగ్-రేస్1
4:45- వరకు ఇంటర్వ్యూలు
20 నవంబర్ ఆదివారం
ఉ.11 గంటల నుంచి11:30 వరకు రేసింగ్ లీగ్ ఎఫ్‌పి 3
మ.12- గంటల ఒంటివరకు లంచ్ బ్రేక్
మ.1 నుంచి 1:15 వరకు క్వాలిఫైంగ్ లీగ్
మ.2 గంటల నుంచి 2:45 వరకు లీగ్ రేస్2
సా.3:30 -గంటల 4:30 వరకు రేస్3
సా.4:30నుంచి 4:45 వరకు ఇంటర్వ్యూలు
16 నుంచి 20వ తేదీ వరకు ఆంక్షలు
ఫార్ములా -ఇకారు రేస్ ట్రయల్స్ ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మార్గ్, ఐమాక్స్ (నెక్లెస్ రోడ్) రోటరీ నుంచి తెలుగుతల్లి జంక్షన్ పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను ప్రకటించారు. ఈ నెల 16న (బుధవారం) రాత్రి 10 గంటల నుంచి ఈ నెల 20న రాత్రి 10 గంటల వరకు ఆంక్షలను విధించారు. ఐమాక్స్ రోటరీ నుంచి తెలుగుతల్లి జంక్షన్, కొత్త సెక్రటేరియట్, ఎన్టీఆర్ గార్డెన్, మింట్ కాంపౌండ్, ఐమాక్స్ రూట్లలో ఈ ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు విధించారు.
ఈవెంట్ కోసం రెండు కమిటీలు
హైదరాబాద్‌లో జరిగే ఈవెంట్ నిర్వహణ కోసం గతంలో తెలంగాణ ప్రభుత్వం రెండు కమిటీలను ఏర్పాటు చేసింది. మంత్రి కెటిఆర్ అధ్యక్షతన మేనేజింగ్ కమిటీ ఏర్పాటు చేయగా, ఈ కమిటీలో సభ్యులుగా మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, సీఈఓ దిల్ బాగ్ గిల్, అధికారులు, బ్రాండ్ అంబాసిడర్లు, నిపుణులు ఉన్నారు. పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటు చేయగా. ఇందులో కమిటీలో సభ్యులుగా హైదరాబాద్ సిపి, పోలీసు, ఆర్ అండ్ బీ, పురపాలక, విద్యుత్, రెవెన్యూ శాఖ అధికారులు ఉన్నారు.