హైదరాబాద్: అసెంబ్లీ నడిచే సమయంలో ఒక ఎంఎల్‌ఎపై అక్రమ కేసులు పెట్టడం సరికాదని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీశ్ రావు తెలిపారు. శాసన సభలో ఫార్ములా ఈ రేస్ అంశంపై చర్చ జరగాలని బిఆర్‌ఎస్ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా హరీశ్ రావు శాసన సభలో మాట్లాడారు. ఫార్ములా ఈ కార్ రేస్ అంశంలో స్పీకర్‌ను ఛాంబర్‌లో కలిసి విజ్ఞప్తి చేశారని, ఫార్ములా ఈ కార్ రేస్ అంశంలో రకరకాల లీకులు ఇస్తున్నారని మండిపడ్డారు. బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌ను అప్రతిష్టపాలు చేసి బిఆర్‌ఎస్‌ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని, తాము ఎలాంటి తప్పు చేయలేదని, తెలంగాణ ఆదాయాన్ని పెంచేందుకు ఫార్ములా ఈ రేస్ నిర్ణయం తీసుకున్నామని హరీశ్ రావు తెలియజేశారు.
తాము తప్పు చేశామని కాంగ్రెస్ వారు అంటున్నారని, సభలో చర్చించి అదేదో చెప్పాలని డిమాండ్ చేశారు. తాము తప్పు చేయలేదని తెలంగాణ కోసం మాత్రమే చేశారని కెటిఆర్ చెప్పారని, ఫార్ములా ఈ రేస్ విషయంలో స్పష్టమైన హామీ ఇస్తేనే సభకు సహకరిస్తామని హరీశ్ రావు స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎంఎల్‌ఎపై ఫార్ములా ఈ కార్ కేసు ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. పెట్టింది అక్రమ కేసు కాకుంటే వెంటనే శాసన సభలో చర్చించాలని డిమాండ్ చేశారు.