ముంబయి: ముడి వంటనూనెలపై దిగుమతి సుంకాలను కేంద్ర ప్రభుత్వం తగ్గించిన నేపథ్యంలో దేశంలో వంటనూనెల ధరలు తగ్గవచ్చంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ ఎఫ్‌ఎంసిజి సంస్థ, ఫార్చూన్ పేరుతో వంటనూనెలను మార్కెట్‌లో విక్రయిస్తున్న అదానీ విల్‌మార్ శనివారం తన బ్రాండ్ వంట నూనెల ధరలను లీటరుపై రూ.10 మేర తగ్గించింది. ఫార్చ్యూన్ రిఫైండ్ సన్‌ఫ్లవర్ నూనె 1లీటరు ప్యాక్ ధరను రూ.220నుంచి రూ.210కి తగ్గించినట్లు ఆ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే ఫార్చ్యూన్ సోయాబీన్, ఫార్చూన్ కచ్చీఘని(ఆవనూనె) ఒక లీటర్ ప్యాక్ ధరలను కూడా రూ.205నుంచి రూ.195కు తగ్గించింది. కొత్త ధరలతో స్టాక్స్ త్వరలోనే మార్కెట్‌లోకి వస్తాయని కూడా కంపెనీ ఆ ప్రకటనలో తెలిపింది. వంట నూనెలపై కేంద్రప్రభుత్వం దిగుమతి సుంకాలను తగ్గించిన నేపథ్యంలో ఆ ప్రయోజనాన్ని వినియోగదారులకు అందించడం కోసం తాము కూడా వంటనూనెల ధరలను తగ్గించినట్లు కంపెనీ ఎండి, సిఇఓ అంగ్షు మల్లిక్ పేర్కొన్నారు.