Friday, November 15, 2024

25 కోట్ల ఏళ్లనాటి ప్రాచీన సముద్ర సరీసృపాలు

- Advertisement -
- Advertisement -

స్వీడిష్, నార్వే పురాతన శాస్త్రవేత్తల బృందం 25 కోట్ల ఏళ్ల నాటి ప్రాచీన సముద్ర సరీసృపాల (marine reptile ) శిలాజాలను కనుగొన గలిగింది. డైనోసార్ యుగంలో బాగా అభివృద్ధి చెందిన ఈ సముద్ర సరీసృపం ఇచ్ధియోసార్స్ (ichthyosarus) అవశేషాలను ఆర్కిటిక్ ప్రాంతంలో నార్వేద్వీపం స్పిట్స్‌బెర్గెన్ లో కనుగొన గలిగారు. ఈ తెగ సరీసృపాలపై మరింత విస్తృత పరిశోధనకు ఇవి అవకాశం ఇస్తున్నాయి.

ఈ సరీసృపంకు చెందిన 11వెన్నుపూసలను, 15 ఎముకల తునకలను నదీ మార్గం వెంబడి అతిశీతల ద్వీపకల్పంలో కనుగొన గలిగారు. వీటిపై భౌగోళిక రసాయన పరీక్షలు, కంప్యూటరీకరించిన మైక్రోట్రొమోగ్రాఫిక్ , బోన్‌మైక్రోస్ట్రక్చరల్ విశ్లేషణలు నిర్వహించారు. 25 కోట్ల సంవత్సరాల క్రితం ప్రపంచంలో మొట్టమొదటి సామూహిక వినాశన సంఘటన జరగక ముందు కాలంలో చేప వంటి సరీసృపాలు మనుగడ సాగించేవని శాస్త్రవేత్తలు అంచనా వేయగలిగారు.

ఇదివరకు భావించిన దాని కన్నా ముందుగానే దీర్ఘకాల ఊహించిన పరివర్తన వీటి విషయంలో జరిగిందని పరిశోధకులు బెంజమిన్ కీర్ నిర్ధారించారు. ఈ పరిశోధన జర్నల్ కరెంట్ బయోలజీలో వెలువడింది. ప్రపంచ వినాశనం ఏర్పడక ముందే ఈ ఇచ్ధియోసార్స్ సరీసృపాలు సముద్రంలో ఈదులాడేవి అని నిర్ధారించడానికి మరిన్ని శిలాజ అవశేషాలు అవసరమవుతాయని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.

ఇదివరకటి సిద్ధాంతం నేల ఆధార సరీసృపాలు కాళ్లతో నడిచేవని, అయితే సామూహిక వినాశనం సంభవించిన తరువాత సముద్రంలో జీవించడం ప్రారంభించాయని వెల్లడించింది. కాలానుగుణంగా పూర్వకాలం నాటి ఉభయచర సరీసృపాలు సముద్రంలో ఈదడంలో మంచి ప్రావీణ్యం సంపాదించాయని, దానికి తగ్గట్టు తమ శరీరాన్ని అవయవాలను ఈతకు అనువైనవిగా మార్చుకున్నాయని ఇదివరకటి సిద్ధాంతం చెప్పింది.

అయితే ఈ శిలాజాల అన్వేషణ, ఇదివరకటి సిద్ధాంతంతో విభేదిస్తోంది. సామూహిక వినాశనం జరగక ముందే 2 కోట్ల సంవత్సరాల క్రితం ఈ సరీసృపాలకు అద్భుతమైన లక్షణాలు ఉండేవని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News