Sunday, December 22, 2024

ఆ లోటును భర్తీ చేస్తున్నాం… రాజీవ్ విగ్రాహ శంకుస్థాపన కార్యక్రమంలో సిఎం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : సచివాలయం సమీపంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఒక పక్క అంబేద్కర్, మరోపక్క ఇందిరాగాంధీ, పివి నరసింహారావు, జైపాల్ రెడ్డితో పాటు ఎంతో మంది త్యాగమూర్తుల విగ్రహాలు ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఉన్నాయని అన్నారు. ఇక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం లేని లోటు స్పష్టంగా కనిపించిందని, ఆ లోటును భర్తీ చేస్తున్నామని చెప్పారు. టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పు తెచ్చిన మహా నేత రాజీవ్ గాంధీ అని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కొనియాడారు. దేశ సమగ్రత కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుడు రాజీవ్ గాంధీ అని అన్నారు.

ఆయన విగ్రహం కేవలం జయంతి, వర్ధంతులకు దండలు వేసి దండాలు పెట్టడానికి కాదని, మహానుభావుల విగ్రహాలు చూసినపుడు వారి స్పూర్తితో ముందుకెళ్లాలన్న భావన మనకు కలగాలని ఆయనన్నారు. ఇది చరిత్రలో నిలిచిపోయే సందర్భమని, సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం ఉన్నన్ని రోజులు ఈ సందర్భం గుర్తుంటుందని రేవంత్ రెడ్డి అన్నారు. అందరికీ ఆదర్శంగా ఉండే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోబోతున్నామని చెప్పారు. విగ్రహావిష్కరణకు సోనియాగాంధీని ఆహ్వానించనున్నట్లు ఆయన తెలిపారు. బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ సూర్య చంద్రులు ఉన్నంత వరకు రాజీవ్ గాంధీ కీర్తి ఉంటుందన్నారు. దేశంలో ఎన్నో సంస్కరణలు తెచ్చారని, 18 ఏళ్ళ యువతకు ఓటు హక్కు క ల్పించారని తెలిపారు. మనం వినియోగిస్తున్న సాంకేతికాభివృద్ధి ఆయన వల్లే సాధ్యమయ్యిందని అన్నారు. విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్న మహానుభావుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. ప్రజలంతా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని చూడాలనుకుంటున్నారన్నారు. దేశ ఐక్యత కోసం ప్రాణాలకు తెగించి దేహం ముక్కలవుతున్నా దేశం కోసం ప్రాణాలర్పించారన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంఎల్‌ఎలు, కాంగ్రెస్ నేతలు వి.హనుమంతరావు, షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు.

Rajiv 2

Rajiv 3

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News