Saturday, February 22, 2025

నేడు ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన

- Advertisement -
- Advertisement -

నారాయణపేట జిల్లా అప్పక పల్లెలో శ్రీకారం
తొలివిడతలో రాష్ట్రవ్యాప్తంగా 72,045 ఇందిరమ్మ ఇళ్లు
మంజూరు శంకుస్థాపన కాగానే మొదటివిడత కింద
లబ్ధిదారుల ఖాతాల్లో లక్ష రూపాయలు జమ నేడు
వికారాబాద్, నారాయణపేట జిల్లాలో సిఎం పర్యటన
నారాయణపేటలో ముఖ్యమంత్రి బహిరంగసభ

మన తెలంగాణ/హైదరాబాద్ : సిఎం రేవంత్ రెడ్డి నేడు ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేయనున్నారు. కాంగ్రెస్ ఎన్నికల హామీల్లో భాగంగా కీలకమైన ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపై ప్రభుత్వం అన్నీ దఫాల వడబోత అనంతరం అర్హులను ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో నేడు (శుక్రవారం) సిఎం నారాయణపేట జిల్లా పర్యటన సందర్భంగా నారాయణపేట మండలంలోని అప్పకపల్లెలో ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేసి రాష్ట్రంలో మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టనున్నారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 72,045 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, వాటికి నేడు శంకుస్థాపన పనులు మొదలు కానున్నాయి. ఇల్లు లేని కుటుంబాలకు ఇళ్లు మంజూరు చేయాలని ప్రభుత్వ సంకల్పంలో భాగంగా లబ్ధిదారులు సొంతంగా ఇల్లు కట్టుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తుంది. ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల పూర్తి సబ్సిడీతో కూడిన ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందించనుంది.

మొదటి విడతలో 72,045 లబ్ధిదారుల ఎంపిక
రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఉన్న పేదలు, ఇందిరమ్మ ఇళ్లు కట్టుకునేందుకు రూ.5,00,000ల చొప్పున నిధులను విడుదల చేయనుంది. ఈ నిధులను నాలుగు విడతల్లో లబ్ధిదారుడికి ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇందులో భాగంగా తొలి విడతలో లక్ష రూపాయలను లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్‌లో జమ చేయనుంది. లబ్ధిదారుల జాబితా ప్రస్తుతం ఇన్‌చార్జీ మంత్రుల చేతుల్లో ఉంది. రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యవేక్షిస్తు న్నారు. ఇందిరమ్మ ఇల్లు ఇప్పటివరకు 80 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా మొదటి విడతలో 72,045 లబ్ధిదారులను ప్రభుత్వం ఎంపిక చేసింది.

శంకుస్థాపన కాగానే తొలి విడతగా రూ.లక్ష చెల్లింపు
నేడు ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన, భూమి పూజ చేసిన కుటుంబాలకు తొలి విడతగా ప్రభుత్వం రూ.లక్షను బ్యాంక్ అకౌంట్‌లలో వేయనుంది. ఆ డబ్బుతో పునాది వేసి గోడలు నిర్మించుకొని, కిటికీల ఎత్తువరకు గోడలను నిర్మించుకోవాల్సి ఉంటుంది. అప్పుడు అధికారులు పరిశీలించి, రెండో విడత నగదు పంపిణీని చెల్లిస్తారు. ప్రభుత్వం రెండో విడతగా రూ.1.25 లక్షలను లబ్ధిదారునికి ఇవ్వనుంది. ఆ డబ్బుతో ఇంటి నిర్మాణం దాదాపు పూర్తవుతుంది. అయితే స్లాబ్ నిర్మాణం కోసం మరో రూ.1.75 లక్షలను ప్రభుత్వం చెల్లించనుంది. ఆ తర్వాత కరెంటు, బాత్రూం, నీటి సరఫరా ఇతరత్రా వాటికి మరో రూ.లక్షను ప్రభుత్వం లబ్ధిదారుడికి చెల్లిస్తుంది. ఇలా మొత్తం రూ.5 లక్షలను లబ్ధిదారుడికి ప్రభుత్వం వారి బ్యాంకు అకౌంట్‌లలో వేయనుంది.

4 సంవత్సరాల్లో మొత్తం 20 లక్షల ఇళ్లు
మొదటివిడతలో భాగంగా 4.5 లక్షల మంది లబ్ధిదారులకు ప్రభుత్వం ఒక్కో లబ్ధిదారుడికి సుమారుగా రూ.5 లక్షలను చెల్లించనుంది. మరో 4 సంవత్సరాల్లో మొత్తం 20 లక్షల ఇళ్లు నిర్మించేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. అయితే ఎవరైనా ఈ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోకపోతే ప్రజా పాలనలో చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారం నింపేవారు అందుకు సంబంధించిన పత్రాలు, జిరాక్స్ కాపీలను జత చేయాల్సి ఉంటుంది. ఇది నిరంతర ప్రక్రియ కావడంతో దీనికి చివరితేదీ లేదని ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వం దరఖాస్తు దారుల వివరాలను ఇందిరమ్మ ఇళ్ల యాప్‌లో నమోదు చేస్తోంది. అర్హుల వివరాలన్నీ ఆ యాప్‌లో నమోదై ఉంటాయి.

నేటి ముఖ్యమంత్రి పర్యటన వివరాలు ఇలా….
వికారాబాద్, నారాయణ పేట జిల్లాల్లో పలు అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. మధ్నాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి వికారాబాద్ జిల్లా దుద్యాల్ మండలం పోలేపల్లి గ్రామానికి చేరుకుంటారు. పోలేపల్లిలో రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో జరిగే పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత నారాయణ పేట మండలం అప్పక్‌పల్లి చేరుకుంటారు అక్కడ జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పెట్రోల్ బంక్‌ను ప్రారంభిస్తారు. బిపిసిఎల్ కంపెనీ సహకారంతో పూర్తిగా మహిళలచే నడిపే పెట్రోల్ బంక్ ఇది. రాష్ట్రంలోనే మొదటి సారి ఈ తరహా బంక్‌ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అనంతరం అప్పక్ పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. నారాయణపేట మెడికల్ కాలేజీలో అకాడమిక్ బ్లాక్‌తో పాటు, ఇతర భవనాల నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు గురుకుల హాస్టల్ ఆవరణలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News