Sunday, December 22, 2024

నేడు ‘దక్షిణ భారత సాంస్కృతిక కేంద్రం’కు శంకు స్థాపన

- Advertisement -
- Advertisement -

ముఖ్య అతిథిగా హాజరుకానున్న వెంకయ్య నాయుడు
పద్మ అవార్డు గ్రహీతలకూ కేంద్ర ప్రభుత్వం తరఫున పౌర సన్మానం

మన తెలంగాణ / హైదరాబాద్ : భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అయిన భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న వివిధ సంస్కృతులను, కళలను కాపాడేందుకు గత పదేళ్లుగా కేంద్ర ప్రభుత్వం కృషిచేస్తోంది. అందులో భాగంగా.. వివిధ ప్రాంతాల్లో అక్కడి సంస్కృతిని ప్రతిబింబించేలా కార్యక్రమాలు, ప్రత్యేక పథకాలను చేపట్టింది. అందులో భాగంగానే సంగీతం, నాటకాలు వంటి కళలకు మరింత ప్రోత్సాహం కల్పించే లక్ష్యంతో కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలోని సంగీత, నాటక అకాడమీ ప్రాంతీయ కేంద్రం (దక్షిణ భారత కేంద్రంగా) ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని సంకల్పించారు.

కేంద్ర సాంస్కృతిక మంత్రి జి.కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జరగనున్న ‘దక్షిణ భారతీయ సాంస్కృతిక కేంద్రం’ శంకుస్థాపన కార్యక్రమానికి గౌరవ భారత పూర్వ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగానే పద్మ అవార్డులు పొందిన తెలుగు రాష్ట్రాలనుంచి మహనీయులకు పౌరసన్మానం చేయాలని నిర్ణయించారు. ‘దక్షిణ భారతీయ సాంస్కృతిక కేంద్రం’గా పేరు పెట్టిన ఈ వేదిక ద్వారా.. సంగీతం, నృత్యం, నాటకం వంటి కళలను మరింత ప్రోత్సహిస్తూ.. వాటిని తర్వాతి తరాలకు చేర్చేలా కార్యక్రమాలకు రూపకల్పన జరగనుంది. తద్వారా ఇక్కడి సంగీతంతోపాటు జానపదం, గిరిజన కళారూపాలకు, నాటకాలకు మంచి ప్రోత్సాహం లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా గానగాంధర్వుడు, పద్మ అవార్డు గ్రహీత ఘంటసాల వెంకటేశ్వరరావు శతజయంతిని 2022- – 23లో ఏడాదిపాటుగా నిర్వహించుకున్న సంగతి తెలిసిందే.

ప్రతిష్ఠాత్మకమైన ఈ సంగీత, నాటక అకాడమీ ప్రాంతీయ కేంద్రంలో.. ఘంటసాలకి సరైన గౌరవాన్ని కల్పిస్తూ.. వారి శత జయంత్యుత్సవాలను పురస్కరించుకుని ‘భారతీయ కళా మండపం’ ఆడిటోరియంను నిర్మించాలని కేంద్ర సాంస్కృతిక శాఖ నిర్ణయించింది. నేటి ( సోమవారం) సాయంత్రం 5 గంటలకు మాధాపూర్‌లోని శిల్పకళా వేదికలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్బంగా సంగీత ప్రపంచంలో ఘంటసాల భాగస్వామ్యన్ని గుర్తుచేసుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. దీంతోపాటుగా, ఈ కార్యక్రమంలోనే.. తెలుగు రాష్ట్రాల నుంచి ఇటీవలే పద్మ విభూషణ్ అవార్డులను పొందిన గౌరవ భారత పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీవితోపాటుగా పద్మ శ్రీ అవార్డులు పొందిన వారిని కూడా కేంద్ర ప్రభుత్వం తరపున పౌర సన్మానం చేయనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News