కన్నూర్ ( కేరళ ): జెమినీ సర్కస్ వ్యవస్థాపకుడు శంకరన్ (99) అనారోగ్యంతో ఆదివారం రాత్రి చనిపోయినట్టు ఆయన కుటుంబీకులు సోమవారం వెల్లడించారు. వృద్ధాప్యం కారణంగా తీవ్ర అనారోగ్యంతో ఆయన కన్నూర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో గత కొన్నాళ్లుగా చికిత్స పొందుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా భారతీయ సర్కస్‌కు ప్రజాదరణ తీసుకురావడంలో శంకరన్ కీలక పాత్ర పోషించారని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రశంసించారు. ప్రగతిశీల దృక్పథం ఉన్న శంకరన్‌తో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆయన గుర్తు చేసుకున్నారు.
వివిధ ప్రధానులు, అధ్యక్షులు, ఇతర ప్రముఖులతో ఆయన సన్నిహిత సంబంధాలు నెరపేవారు. సర్కస్ కళకు ఆయన లేని లోటు తీరనిది అని సిఎం పేర్కొన్నారు. 1924 లో జన్మించిన శంకరన్ ప్రఖ్యాత సర్కస్ కళాకారుడు కీలేరి కున్హికన్నన్ వద్ద మూడేళ్ల పాటు శిక్షణ పొందారు. సైన్యంలో చేరి రెండో ప్రపంచ యుద్ధం తరువాత రిటైర్ అయ్యారు. దేశం లోని వివిధ సర్కస్ గ్రూపులతో పనిచేశారు. 1951 లో విజయా సర్కస్ గ్రూపును కొనుగోలు చేసి జెమినీ సర్కస్‌గా పేరు మార్చి ప్రఖ్యాతి వహించారు. కేంద్ర ప్రభుత్వం జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించింది. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆయన అంత్యక్రియలు మంగళవారం జరుగుతాయి.