కర్ణాటక నగరమైన బెళగావిలో మరాఠీ మాట్లాడని కారణంగా బస్సు కండక్టర్‌పై కొందరు వ్యక్తులు శుక్రవారం దాడి చేశారు. ఈ దాడిలో కండక్టర్ గాయపడ్డాడు. ఈ కేసులో నలుగురిని అరెస్టు చేసినట్టు శనివారం పోలీసులు చెప్పారు. పోక్సో చట్టం కింద కండక్టర్‌పై కూడా కేసు నమోదైందని పోలీసులు వివరించారు. 51 ఏళ్ల కండక్టర్ మహదేవప్ప మల్లప్ప హుక్కేరి ఈ సంఘటనపై శుక్రవారం విలేఖరులకు వివరించాడు. ఒక అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్‌తో సులేభావ్ గ్రామం వద్ద బస్సు ఎక్కిందని, మరాఠీలో మాట్లాడిందని, అయితే తనకు మరాఠీ రాదని, కన్నడలో మాట్లాడాలని చెప్పానని కండక్టర్ తెలియజేశారు. “ నాకు మరాఠీ రాదని చెప్పినప్పుడు, ఆ అమ్మాయి దుర్భాషలాడుతూ మరాఠీ తప్పనిసరిగా నేర్చుకోవాలని హెచ్చరించిందన్నాడు. అయితే ఇంతలో పెద్ద గుంపుగా కొందరు వచ్చి తన తలపై , ఒంటిపైన తీవ్రంగా కొట్టారని కండక్టర్ ఆరోపించాడు.గాయపడిన బస్సు కండక్టర్‌ను బెలగావి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చేర్చారు. ఆయనకు స్వల్పగాయాలయ్యాయని, ప్రమాదం నుంచి బయటపడ్డాడని పోలీసులు తెలిపారు.
ఈ దాడికి సంబంధించి, నలుగురిని అరెస్టు చేసినట్టు పోలీసులు చెప్పారు. అయితే బస్సు కండక్టర్ తనపై అసభ్యకరపదజాలంతో దూషించాడని 14 ఏళ్ల బాలిక చేసిన ఫిర్యాదు ఆధారంగా కండక్టర్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామన్నారు. అయితే పోక్సో చట్టం కేసు కింద ఎవరినీ అరెస్టు చేయలేదన్నారు. కండక్టర్‌పై దాడి కేసులో నలుగురిని అరెస్టు చేశామని, మరికొందరు నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం మూడు బృందాలు గాలిస్తున్నాయని పోలీస్ కమిషనర్ లాడా మార్టిన్ మర్బనియాంగ్ చెప్పారు. కండక్టర్‌పై పోక్సో కేసు గతరాత్రి నమోదు చేశామన్నారు. నిజానిజాలు తెలుసుకోడానికి దర్యాప్తు చేస్తున్నామని, బస్సులో ప్రయాణించిన ప్రయాణికుల నుంచి కూడా వాంగ్మూలాలు తీసుకుంటామన్నారు. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడంతో చాలా కాలంగా అక్కడ ఉద్రిక్తతలు సాగుతున్నాయని, శాంతి భద్రతలను పరిరక్షించడానికి ప్రయత్నించాల్సిందిగా పొరుగు జిల్లాల ఎస్‌పీలతో మాట్లాడానని పోలీస్ కమిషనర్ తెలిపారు.
కన్నడ మద్దతుదార్ల ఆందోళన
బస్సు కండక్టర్‌పై దాడి జరిగిన తరువాత కన్నడ మద్దతుదారులు ఆందోళనకు దిగారు. శనివారం బెలగావి బగల్‌కోటే రోడ్డును దిగ్బంధం చేశారు. దిష్టిబొమ్మలను తగుల బెట్టారు. వారిని పోలీసులు అడ్డుకుని వ్యానులో తరలించారు. అదే విధంగా మరిహాల్ పోలీస్ స్టేషన్ ముందు కొందరు ధర్నా చేశారు. కండక్టర్‌పై తప్పుడు కేసు పెట్టారని నిరసన తెలిపారు. బెళగావిలో మరాఠీ మాట్లాడే వారి సంఖ్య తగినంతగా ఉంది. ఆ వర్గం వారు బెళగావి జిల్లాను మహారాష్ట్రలో విలీనం చేయాలని గత కొన్నాళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. అయితే అక్కడ ఉంటున్న కన్నడిగులు, కర్ణాటక ప్రభుత్వం దీనిని వ్యతిరేకిస్తోంది.