మనతెలంగాణ, హైదరాబాద్ : బ్లాక్ ఫంగ్‌స్‌కు ఇచ్చే అంఫోటెరిసిన్ ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్ చేస్తున్న నలుగురు వ్యక్తులను నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 5 ఇంజక్షన్లు, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం….రంగారెడ్డి జిల్లా, యాచారం మండలం,గ్రామానికి చెందిన నారిమళ్ల యాదయ్య మెడిసిన్ సప్లయర్, జనగాంకు చెందిన పెడ్డోచ్ సతీష్ ఫార్మసీ ఉద్యోగి, ఎపిలోని రాజమండ్రికి చెందిన కక్కిరాలా సాయికుమార్ ఫార్మసీ ఉద్యోగి, బుడ్డారెడ్డిగారి రాజశేఖర్ రెడ్డి మెడికల్ రిప్రజెటేటీవ్‌గా పనిచేస్తున్నాడు. కరోనా నుంచి కోలుకున్న వారికి బ్లాక్ ఫంగస్ వస్తుండడంతో అంఫోటెరిసిన్ ఇంజక్షన్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. దానిని క్యాష్ చేసుకోవాలని నలుగురు వ్యక్తులు ప్లాన్ వేశారు. మార్కెట్‌లో వాటి ధర రూ.7,858 ఉండా వాటిని రూ.50,000లకు విక్రయిస్తున్నారు. అందరూ మెడికల్ ఫీల్డ్‌లో ఉండడంతో వాటిని దగ్గర పెట్టుకుని అవసరం ఉన్న వారికి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. విషయం నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు తెలియడంతో దాడిచేసి పట్టుకున్నారు. టాస్క్‌ఫోర్స్ ఇన్స్‌స్పెక్టర్ నాగేశ్వరరావు, ఎస్సైలు శ్రీకాంత్, పరమేశ్వర్ తదితరులు పట్టుకున్నారు.