Wednesday, November 6, 2024

‘అకాడమీ’ నిధుల కేసులో నలుగురి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Four arrested in Telugu Academy funding case

రూ. 60 కోట్ల నిధుల గల్లంతు కేసులో చర్యలు, మరిన్ని అరెస్ట్‌లు జరిగే అవకాశం
 ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్న త్రిసభ్య కమిటీ

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలుగు అకాడమీ డిపాజిట్ల గోల్‌మాల్ కేసులో దర్యాప్తు వేగవంతం చేసిన సిసిఎస్ పోలీసులు మొత్తం నలుగురిని అరెస్ట్ చేశారు. అగ్రసేన్ బ్యాంక్ మేనేజర్ పద్మావతి, యూనియన్ బ్యాంకు మేనేజర్ మస్తాన్‌వలీ, ఎపి మర్కంటైల్ సహకార సంఘం ఉద్యోగి మొయినుద్దీన్‌ను ఇదివరకే పోలీసులు అరెస్ట్ చేయగా తాజాగా ఎపి మర్కంటైల్ సహకార సంఘం ఛైర్మన్ సత్యనారాయణను సైతం అరెస్ట్ చేశారు. ఈ నలుగురు నిందితులను శుక్రవారం నాడు సిసిఎస్ పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. అకాడమీకి చెందిన రూ.60 కోట్ల ఎఫ్‌డిలు దారి మళ్లించినట్లు సిసిఎస్ పోలీసులు గుర్తించారు. నకిలీ పత్రాలతో మర్కంటైల్ సహకార సంఘంలో ఖాతాలు సృష్టించి నిధులు మళ్లించారని, ఇందుకు సహకార సంఘం ఉద్యోగులు సహకరించినట్లు పోలీసులు తేల్చారు. తెలుగు అకాడమీ నిధుల గల్లంతు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. సిసిఎస్ పోలీసుల విచారణలో బ్యాంకు ఖాతాల్లో గల్లంతైన నిధుల మొత్తం పెరుగుతోంది.

అకాడమీకే చెందిన మరో రూ.17 కోట్లు గల్లంతైన విషయం బయటకు వచ్చింది. హైదరాబాద్‌లోని కార్వాన్ యూనియన్ బ్యాంకు శాఖలో గత ఏడాది డిసెంబరు నుంచి ఈ ఏడాది జూలై వరకూ పలు విడతలుగా రూ.43 కోట్లు గల్లంతైన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే బ్యాంకుకు చెందిన సంతోష్‌నగర్ బ్రాంచ్‌లో రూ.8 కోట్ల ఫికస్డ్ డిపాజిట్లు కూడా జూలై, ఆగస్టు నెలల్లో గల్లంతయ్యాయి. కెనరా బ్యాంకు నుంచి మరో రూ.9 కోట్లను కూడా దారి మళ్లించి కాజేశారు. దాంతో, తాజాగా బయటపడిన రూ.17 కోట్లతో కలిపి మొత్తం కుంభకోణం విలువ రూ.60 కోట్లకు చేరుకుంది. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేపడుతున్నామని, అనతికాలంలో మరిన్ని అరెస్ట్‌లు జరిగే అవకాశం ఉందని సిసిఎస్ పోలీసు అధికారులు పేర్కొంటున్నారు. ఇదిలావుండగా మరోవైపు ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ కూడా డిపాజిట్ల కుంభకోణానికి సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తోంది. ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించే అవకాశం ఉంది.

ఇలా జరిగింది..

డిపాజిట్ల గోల్‌మాల్ కేసులో ఇప్పటి వరకు నలుగురు నిందితులు దాదాపు రూ. 60 కోట్ల రూపాయల డిపాజిట్లను దారి మళ్లించినట్లు పోలీసులు గుర్తించారు. మొత్తం రూ. 330 కోట్ల రూపాయలను తెలుగు అకాడమీ 11 బ్యాంకుల్లోని 34 ఖాతాల్లో డిపాజిట్ చేసింది. ప్రధానంగా యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంకుల్లో డిపాజిట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈక్రమంలోనే అకాడమీ నిధులు మాయమైనట్లు గుర్తించిన అధికారులు బ్యాంకు అధికారుల పాత్రపై తెలుగు అకాడమీ ఫిర్యాదు చేసింది. కాగా, దీనిపై సరైన పత్రాలు చూశాకే డిపాజిట్లు క్లోజ్ చేశామని బ్యాంకు ప్రతినిధులు పోలీసులకు తెలిపారు. కాగా ఎపి వర్తక సహకార సంఘం ఏర్పాటు చేసినట్లు లేఖ సృష్టించి అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. డిపాజిట్లు రద్దు చేయాలని అధికారుల పేర్లతో బ్యాంకులకు లేఖరాశారు.

ఇలా బయటపడింది..

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో ఉన్న తెలుగు అకాడమీ హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో దశాబ్దాలుగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఉమ్మడి జాబితాలో ఉన్న తెలుగు అకాడమీ నిధులను ఆంధ్రప్రదేశ్‌కు పంచాలంటూ కొద్దిరోజుల క్రితం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో భవనాలు, నగదు వివరాలను లెక్కిస్తుండగా.. వివిధ బ్యాంక్‌లతోపాటు యూబిఐ కార్వాన్, సంతోష్‌నగర్ శాఖల్లో రూ.43 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లున్నాయని తేలింది. గడువు తీరకముందే వాటిని తీసుకోవాలని అకాడమీ అధికారులు నిర్ణయించారు. ఈనెల 21న డిపాజిట్ పత్రాలు బ్యాంకుకు చేరినా అటువైపు నుంచి సమాచారం లేకపోవడంతో మూడు రోజుల తర్వాత తెలుగు అకాడమీ ఉద్యోగి రఫీక్ నేరుగా బ్యాంకుకు వెళ్లారు. ఆగస్టులోనే రూ.43 కోట్లు విత్‌డ్రా అయ్యాయని బ్యాంకు అధికారులు తెలిపారు. నిగ్గు తేల్చాలని అకాడమీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

డైరెక్టర్ సోమిరెడ్డిపై వేటు

తెలుగు అకాడమీలో డిపాజిట్ల గోల్‌మాల్ కేసులో ప్రభుత్వం శుక్రవారం నాడు తెలుగు అకాడమీ డైరెక్టర్ సోమిరెడ్డిపై వేటు వేసింది. తెలుగు అకాడమీ డైరెక్టర్ అదనపు బాధ్యతల నుంచి సోమిరెడ్డిని విద్యాశాఖ తప్పించి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేనకు అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇప్పటికే ఈ కేసులో ముమ్మర దర్యాప్తు చేస్తున్న సిసిఎస్ పోలీసులు ఈ స్కాంలో ఇప్పటి వరకు మొత్తం నలుగురిని అరెస్ట్ చేశారు. తెలుగు అకాడమీ ఫిక్స్‌డ్ డిపాజిట్ల గోల్‌మాల్ పై నిగ్గు తేల్చేందుకు ముగ్గురు సభ్యులతో ఓ కమిటీని నియమించింది. ఇంటర్‌బోర్డు కార్యదర్శి, బోర్డులోని అకౌంట్స్ అధికారి, కళాశాల విద్యాశాఖ సంయుక్త సంచాలకుడు ఇందులో సభ్యులుగా నియమించింది. నిధుల గోల్‌మాల్ వ్యవహారంపై సాధ్యమైనంత త్వరగా నివేదిక అందజేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News