Sunday, January 19, 2025

భూమికి చేరకున్న నాసా స్పేస్‌ఎక్స్ క్రూ నలుగురు వ్యోమగాములు

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : నాసా స్పేస్ ఎక్స్ ఎండ్యూరెన్స్ క్రూ 5 మిషన్‌కు చెందిన డ్రాగన్ వ్యోమనౌక ద్వారా నలుగురు వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్) నుంచి ఆదివారం సురక్షితంగా భూమికి దిగి వచ్చారు. ఈ నలుగురు వ్యోమగాముల్లో నాసా వ్యోమగాములు నికోలె మాన్, జోష్ కెసాడా, జపాన్‌కు చెందిన వ్యోమగామి కొయిచి వకాతా, రాస్కోస్‌మాస్ కాస్మోనట్ అన్నా కికినా ఉన్నారు. భూ కక్షలోని ఐఎస్‌ఎస్‌లో వీరు 157 రోజులు గడిపిన తరువాత తిరుగు ప్రయాణమయ్యారు. ఫ్లోరిడా లోని టంపా తీరంలో రాత్రి 9.02 గంటలకు (భారత కాలమానం ప్రకారం ఉదయం 7.02 గంటలకు ) వీరు చేరుకున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రంలో వీరు కీలకమైన సైన్సు ప్రయోగాలను , సాంకేతిక ప్రదర్శనలను నిర్వహించగలిగారు. భవిష్యత్తులో అంతరిక్ష పరిశోధనలు మరింత లోతుగా సాగించడానికి ఈ ప్రయోగాలు మరింత ఉపయోగపడగలవని, చంద్రయాత్రకు మార్గం ఏర్పర్చగలవని నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ ప్రకటించారు.

ఈ అన్వేషణలో ప్రతిపురోగతి ఏ ఒక్కరి విజయం కాదని, యావత్ మానవజాతి వేసిన పెద్ద అడుగని ఆయన అభివర్ణించారు. వ్యోమగాములు మాన్, కెసాడా, వకాతా, కికినా, ఈ మిషన్ సందర్భంగా 6, 6 5 ,77.531మైళ్లు ప్రయాణించారు. అంతరిక్ష స్థావరంలో 156. 5 రోజులు ఉన్నారు. భూమి చుట్టూ 2512 సార్లు ప్రదక్షిణలు పూర్తి చేశారు. వ్యోమగాములు మాన్, కెసాడా, కికినాలకు ఇది మొట్టమొదటి వ్యోమయాత్ర కాగా, వకాతా కు మాత్రం గతంలో తన ఐదు వ్యోమనౌకల ద్వారా 505 రోజులు అంతరిక్షంలో ఉన్న అనుభవం ఉంది. కెసాడా నాసా వ్యోమగామి ఫ్రాంక్ రుబియోతో కలిసి మూడు సార్లు అంతరిక్ష గమనంలో నడిచారు. అంతరిక్ష స్థావరంలో కొత్తగా రెండు సౌర శ్రేణులను అమర్చ గలిగారు. మాన్, వకాతా కలిసి సంయుక్తంగా రెండుసార్లు అంతరిక్షంలో నడకలు సాగించారు. సౌర శ్రేణుల కోసం కక్షలో లేబొరేటరీ నిర్వహించగలిగారు.

అంతరిక్ష కేంద్రంలో ఈ వ్యోమగాములు నేల ఉపయోగించకుండా మొక్కలను పెంచడానికి హైడ్రోపోనిక్, ఎయిరోపోనిక్ అనే సాంకేతికతలను పరీక్షించ గలిగారు. ఉగాండా, జింబాబ్వే మొదటి శాటిలైట్లను విడుదల చేసి , కంటైనర్‌లో ద్రవాలు ఎలా కదులుతాయో పరిశీలించారు. మూన్ రోవర్ డిజైన్లను అభివృద్ధి చేశారు. దీనికి తోడు కొన్ని పోషక విలువల ఉత్పత్తికి సాంకేతికత ఉపయోగించారు. తమ దైనందిన ఆహార అవసరాల కోసం అంతరిక్షంలో పొట్టి టొమాటో రకాలను పెంచగలిగారు. అంతరిక్షం లోనే మానవ అవయవాలను తయారు చేసే సామర్థం ఉన్న అవకాశం కలిగిన బయోప్రింటింగ్ సౌకర్యాన్ని తిరిగి అంతరిక్ష స్థావరంలో నెలకొల్ప గలగడం ఒక మైలురాయి వంటిదని నాసా ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News