Tuesday, November 5, 2024

నలుగురిని మింగిన ఈత సరదా

- Advertisement -
- Advertisement -

మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో విషాధం

తొర్రూరు : సరదా కోసం ఇద్దరు విద్యార్థులు ఈతకు వెళ్తే శవమైన సంఘటన మండలం, అమ్మాపురంలో ఆదివారం చోటు చేసుకుంది. బేడ బుడగ జంగాల కులానికి చెందిన గంధం స్వామి రూప దంపతుల కుమారుడు యాకూబ్ (12), కిన్నెర మహేశ్ లక్ష్మి దంపతుల కుమారుడు జంపా (10) ఆదివారం సెలవు కావడంతో గ్రామ శివారులోని చెరువు వద్ద వాగులో స్నేహితులతో కలిసి మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఈత కోసం వెళ్లారు. ఈత రాకపోవడంతో కుంటలో దిగిన ఇద్దరు గంధం యాకూబ్, కిన్నెర జంపా ప్రమాదవశాత్తు మునిగిపోతుండడంతో గమనించిన తోటి మిత్రులు కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్న వారు వచ్చే సరికి కుంటలో మునిగిపోయారు.

కుంటలో మునిగిపోయిన చిన్నారులను గ్రామస్థులు బయటకు తీశారు. అప్పటికే చేరుకున్న చిన్నారుల కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు ఒక్కసారిగా బోరున విలపించారు. అప్పటివరకు ఎంతో సంతోషంగా ఉన్న చిన్నారులు విగతజీవులుగా పడి ఉండటాన్ని చూసి కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. పిల్లలను చూసిన గ్రామస్థులు బోరున విలపించారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ జగదీశ్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గంధం రూప ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మరో ఘటనలో..

భూపాలపల్లి జిల్లా, మలహర్ రావు మండలం, తాడిచెర్ల గ్రామంలోని చెరువులో పడి ఆదివారం ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. కుటుంబీకుల కథనం ప్రకారం.. తాడిచర్లకు చెందిన బొంతల రాజు, అనూష కుమారులు బొంతల అరుణ్, (12) బొంతల కార్తీక్ (9) వారి ఇంటి పక్కనే ఉన్న చెరువు వద్దకు మేకల కాపు కోసం వెళ్లి మేకలను చెరువు లోపలికి వెళ్తుండగా మలిపే క్రమంలో చెరువులో జెసిబి తీసిన గుంతలో పడి ప్రమాదంలో ఒకరు చిక్కుకొన్నాడు. అతనిని కాపాడే ప్రయత్నంలో మరొక చిన్నారి కూడా అందులోనే మునిగిపోయాడు. సమాచారం తెలుసుకున్న తల్లి చెరువు వద్దకు వెళ్లి చూడగా తమ పిల్లల చెప్పులు గుర్తించి ప్రమాదంలో ఇరుక్కున్నారని తెలిసి కేకలు పెట్టగా పక్కనున్నవారు వచ్చి చూసే క్రమంలో చెరువులో అచేతనులై ఉన్నారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషాద ఘటనతో తాడిచర్ల వాసులు, బంధువులు కన్నీరు మున్నీరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News