Tuesday, January 21, 2025

బీచ్‌లో నలుగురు యువకుల గల్లంతు

- Advertisement -
- Advertisement -

ముంబై : పెను తుపాన్ బిపార్‌జాయ్‌పై వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ హెచ్చరికలు వెలువరిస్తోంది. ఈలోగానే తుపాన్ ప్రభావం చూపుతోంది. ముంబై జుహూ బీచ్‌లో నలుగురు యువకులు గల్లంతు అయ్యారు. గుజరాత్ భుజ్‌లో ఇద్దరు పిల్లలు బలి అయ్యారు. రైళ్లు , విమానాలు రద్దు అవుతున్నాయి. గుజరాత్ తీరంతో పాటు ఇప్పుడు ముంబై తీరానికి కూడా అలర్ట్‌లు పంపించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, ముంబై తీరం లోపలి ప్రాంతాలు కూడా అప్రమత్తం అత్యవసరం అని తెలిపారు. ఈ తుపాన్ ఇటు గుజరాత్, కొంత మేర మహారాష్ట్ర అటు పాకిస్థాన్‌లో కూడా ప్రకంపనలకు దారితీస్తోంది. పలు ప్రాంతాలలో ఆరెంజ్ సందేశాలు వెలువరించారు. సోమవారం ఉదయం నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే 95 రైళ్లను, విమానాలను ముంబైలో నిలిపివేశారు.

దీనితో ముంబై విమానాశ్రయంలో, రైల్వేస్టేషన్లలో గందరగోళం నెలకొంది. తుపాన్ కారణంగా వాతావరణం అనుకూలించకపోవడంతో ఉన్నట్లుండి ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రధాన రన్‌వేను తాత్కాలికంగా మూసివేశారు. తుపాన్ కారణంగా వచ్చే రెండు రోజులలో ముంబై, చుట్టుపక్కల ప్రాంతాలలో భారీ వర్షాలు, పెనుగాలులు వీస్తాయని వాతావరణ విభాగం తెలిపింది. అరేబియా సముద్రం ఆటుపోట్లు ఉధృతి దశలోనే ముంబై తీరం జుహు బీచ్‌లో ఈతకొట్టేందుకు వెళ్లిన నలుగురు యువకులు సోమవారం జాడతెలియకుండా పొయ్యారు. వీరిని కనుగొనేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి.
గుజరాత్ భుజ్‌లో ఇద్దరు బాలులు బలి
సైక్లోన్ బిపార్‌జాయ్ తీరాన్ని తాకకముందే గుజరాత్ తీరంలో విషాదం మిగిల్చింది. తుపాన్ గాలులు తీవ్రమవుతున్న దశలో భుజ్ జిల్లాలోని లకూరాయ్‌లో ఓ పూరిల్లు గోడ కూలి ఇద్దరు బాలలు తీవ్రంగా గాయపడి తరువాత మృతి చెందారు. మరో చిన్నారికి తీవ్రగాయాలు అయ్యాయి. తుపాన్ తాకిడి తీవ్రతతో ఇప్పటికే గుజరాత్ తీరం వెంబడి పలు బీచ్‌లను మూసివేశారు. సోమవారం సాయంత్రానికి తుపాన్ పోర్‌బందర్‌కు దాదాపు 340 కిలోమీటర్లు ఆగ్నేయంగా, దేవ్‌భూమి ద్వారకాకు 380 కిమీల వాయవ్యంగా, నలియాకు 470 కిమీలు, కరాచీకి 640 కిలోమీటర్లు దక్షిణంగా ఉంది. ఈ తుపాన్ ఏ ప్రాంతంలో తీరానికి తాకేది వాతావరణ విభాగానికి నిర్థారణ కాలేదు. మంగళవారం రాత్రికి దీని పరిస్థితి స్పష్టం కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News