Tuesday, December 24, 2024

వేర్వేరు సంఘటనల్లో నలుగురు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -
  • అహ్మద్‌గూడ ఆర్‌జీకే కాలనీలో ఆర్ధిక ఇబ్బందులతో నవ దంపతులు
  • కుందన్‌పల్లి గ్రామంలో కౌలు రైతు బలవన్మరణం
  • ఆర్‌జెకె కాలనీలో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

కీసర: వేర్వేరుగా జరిగిన రెండు సంఘటనల్లో ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర మండలం అహ్మద్‌గూడ రాజీవ్ గృహకల్ప కాలనీలో జరిగిన సంఘటనలో ప్రేమ వివాహాం చేసుకున్న నవ దంపతులు ఆర్ధిక ఇబ్బందులతో బలవన్మరణానికి పాల్పడ్డారు.

సీఐ రఘువీర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మూడుచింతలపల్లి మండలం కేశ్వాపూర్ గ్రామానికి చెందిన దాసరి ఆంజనేయులు (24), కాప్రా జమ్మిగడ్డకు చెందిన బొట్టు వైష్ణవి (20) గత ఆరు నెలల క్రితం ప్రేమ వివాహాం చేసుకొని అహ్మద్‌గూడ రాజీవ్ గృహకల్ప కాలనీలో నివాసం ఉంటున్నారు. ఆంజనేయులు డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గత కొన్ని రోజులుగా ఆర్ధిక సమస్యలు చుట్టుముట్టడంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. కాగా సోమవారం అర్థరాత్రి 1.00 గంటల ప్రాంతంలో ఇద్దరు ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు.

మొదట వైష్ణవి గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకోగా తర్వాత ఆంజనేయులు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. నవ దంపతులు రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

కుందన్‌పల్లిలో కౌలు రైతు ఆత్మహత్య

కుందన్‌పల్లి గ్రామంలో ఉరి వేసుకొని కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుందన్‌పల్లి గ్రామానికి చెందిన కడమంచి నర్సింహ్మ (38) గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలాన్ని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. ఆర్ధిక ఇబ్బందులతో సోమవారం రాత్రి వ్యవసాయ పొలంలోని గదిలో తాడుతో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నగరంలోని గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఆర్‌జీకే కాలనీలో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

కీసర మండలం అహ్మద్‌గూడ రాజీవ్ గృహకల్ప కాలనీలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కీసర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. మహబూబ్‌నగర్ పట్టణానికి చెందిన ఆటో డ్రైవర్ నాగరాజు (35) గత కొంత కాలంగా కుటుంబ సభ్యులతో కలిసి 7వ బ్లాక్‌లో నివాసం ఉంటున్నాడు. మంగళవారం సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానఇకి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతునికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబ కలహాలతోనే నాగరాజు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కీసర పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గడిచిన 24 గంటల వ్యవదిలో రాజీవ్ గృహకల్ప కాలనీలో జరిగిన వేర్వేరు సంఘటనలలో ముగ్గురు బలవన్మరణాలకు పాల్పడం స్థానికులను ఆందోళనకు గురిచేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News