న్యూఢిల్లీ : నోయిడా లోని సెక్టార్ 21 లోని జలవాయు విహార్ లోని ఒక రెసిడెన్షియల్ సొసైటీ ప్రహరీ గోడ కూలి నలుగురు మృతి చెందగా, తొమ్మిది మంది గాయపడ్డారు. మరికొంతమంది శిధిలాల కింద చిక్కుకున్నట్టు అధికారులు భావిస్తున్నారు. బుల్‌డోజర్ల సాయంతో శిధిలాలను తొలగించే పనులు చేపట్టారు. నోయిడా జిల్లా మేజిస్ట్రేట్ సాహస్ ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు పర్యవేక్షించారు. “ సెక్టార్ 21 లోని జలవాయు విహార్ వద్ద డ్రైయినేజి పనులను నోయిడా అథారిటీ కాంట్రాక్టుకు ఇచ్చింది. ఇక్కడ పనులు నిర్వహిస్తుండగా గోడ కూలినట్టు మాకు సమాచారం వచ్చింది. దీనిపై సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తాం. కొందరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. వారిని ఆస్పత్రులకు తరలించాం. క్షతగాత్రులను ఇప్పటికే గుర్తించాం. మరెవరైనా శిధిలాల కింద చిక్కుకున్నారేమో అనే అనుమానంతో గాలింపు చర్యలు చేపట్టాం ’ అని పేర్కొన్నారు. పోలీస్ సిబ్బంది అక్కడకు వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. మృతుల కుటుంబాలకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు. సీనియర్ అధికారులు తక్షణమే ప్రమాద స్థలానికి చేరుకుని యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. గాయపడిన వారికి తగిన చికిత్స అందించాలని ఆదేశించారు.