Sunday, December 29, 2024

గృహప్రవేశంలో విషాదం.. కరెంట్ షాక్‌తో నలుగురు మృతి..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తమ కలల స్వప్నమైన ఇంటిని నిర్మించుకున్న ఓ కుటుంబానికి ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. గృహప్రవేశ కార్యక్రమంలో కరెంట్‌ షాక్‌ తగిలి నలుగురు మృతి చెందిన ఘటన అన్నమయ్య జిల్లా పెద్దతిప్పసముద్రం మండలంలోని కానుగామాకులపల్లెలో చోటుచేసుకుంది. టెంట్‌ రూపంలో మృత్యువు ముంచుకొచ్చింది. భారీగా వీచిన గాలులతో టెంట్‌ పక్కనే ఉన్న 11 కేవీ విద్యుత్ తీగలపై పడటంతో ప్రమాదం జరిగింది. బంధుమిత్రుల ఆనందోత్సాహాల నడుము జరగాల్సిన కార్యక్రమం విషాదంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. పెద్దతిప్పసముద్రం మండలం కానుకమాకులపల్లెలో ఓ కుటుంబం కొత్తగా ఇంటిని నిర్మించుకుని గృహప్రవేశానికి అంతా సిద్దం చేసుకుంది.

బంధువులు అంతా వేడుకకు రావటంతో సందడి వాతావరణం నెలకొంది. కానీ.. అదే ఇంటిని మృత్యువు కూడా నీడలా వెంటాడింది. ఏం జరుగుతుందో ఊహకు కూడా అందకుండానే క్షణాల్లో దారుణం జరిగిపోయింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడ్డవారిని బి కొత్తకోట మండలంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇక.. మృతులను లక్ష్మమ్మ, శాంతమ్మ, లక్ష్మన్న, ప్రశాంత్‌గా గుర్తించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో వేడుక జరుగుతున్న ఆ ఇంట్లో విషాదఛాయలు అలముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News