వరద ఉధృత్తితో దిగువ మూసీలోకి నీరు విడుదల
మూసీ సమీప ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు
పరిస్దితులను పర్యవేక్షిస్తున్న జలమండలి, జీహెచ్ఎంసీ అధికారులు
రాబోయే మూడు రోజులు నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు
మన తెలంగాణ, హైదరాబాద్ : నగర చుట్టు పక్కల కురుస్తున్న వర్షాలకు ఉస్మాన్ సాగర్ జలాశయానికి వరద నీరు భారీగా చేరుతోంది. ఇప్పటికే జలశయం పూర్తి స్దాయి నీటి మట్టానికి చేరుకుంది. ఇప్పటికే 23వ తేదీన రెండు గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదలుతున్నారు. సోమవారం మధ్యాహ్నం మరో రెండు గేట్లు ఎత్తారు. దీంతో ప్రస్తుతం మొత్తం నాలుగు గేట్లను ఒక అడుగు మేర ఎత్తి 480 క్యూసెక్కుల నీటిని మూసీ నదిలోకి వదులుతున్నారు. ప్రస్తుతం గండిపేట జలాశయానికి 350 క్యూసెక్కుల ఇన్‌ప్లో కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈఏడాదిలో ఉస్మాన్‌సాగర్ గేట్లు తెరవడం ఇది మూడోసారి, వరద ఉధృతి పెరుగుతుండటంతో ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా ముందు జాగ్రత్తగా మూసి నది లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు డివిజన్ అధికారులు పేర్కొంటున్నారు.
మూసినదికి ఇరువైపులా ఎప్పటికప్పుడు పరిస్దితులను పర్యవేక్షిస్తున్నారని, ప్రజలెవరు అటువైపు వెళ్లొదని సూచిస్తున్నారు. పరిస్దితులను హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లను,అధికార యంత్రాగాలతో పాటు , జీహెచ్ఎంసీ, పోలీసు అధికారులను ఆదేశించారు. హిమాయత్ సాగర్ రిజర్వాయర్ నుంచి కూడా ఒక గేటు ద్వారా నీరు మూసీలో వదులుతున్నారు.
ఉస్మాన్‌సాగర్ పూర్తి స్దాయి నీటి మట్టం 1790 అడుగులుండగా, ప్రస్తుత నీటి స్దాయి 1789.90 అడుగులకు చేరింది. రిజర్వాయర్ పూర్తి సామర్దం 3.90టిఎంసీలు కాగా, ప్రస్తుతం 3.877 టిఎంసీలు ఉన్నట్లు, ఇన్ ప్లో 300 క్యూసెక్కులు, అవుట్‌ప్లో 480 క్యూసెక్కులు మొత్తం గేట్లు 15 ఉండగా, ప్రస్తుతం 4 గేట్ల ద్వారా వరద జలాలు దిగువ ప్రాంతానికి వదలుతున్నారు.
హిమాయత్‌సాగర్ పూర్తి స్దాయి నీటి మట్టం : 1763.50 అడుగులు, ప్రస్తుత నీటిస్దాయి : 1763.30 అడుగులు, రిజర్వాయర్ పూర్తి సామర్దం : 2.97 టీఎంసీలు, ప్రస్తుత సామర్దం : 2.893 ,ఇన్‌ప్లో : 350 క్యూసెక్కులు,అవుట్ ప్లో : 350 క్యూసెక్కులు, మొత్తం గేట్ల సంఖ్య : 17 గేట్లు, ఎత్తిన గేట్ల సంఖ్య : ఒకటి గేటు