Monday, December 23, 2024

గొర్రెల పంపిణీ అక్రమాల కేసులో నలుగురు ప్రభుత్వ అధికారుల అరెస్ట్

- Advertisement -
- Advertisement -

మప తెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీలో అక్రమాల కేసులో అరెస్టులు మొదలయ్యాయి. ఈ స్కాంపై విచారణ జరుపుతున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు గురువారం నలుగురు సీనియర్ ప్రభుత్వ అధికారులను అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో కామారెడ్డి వెటర్నరీ ఏరియా ఆస్పత్రి అసిస్టెంట్ డైరెక్టర్ ధర్మపురి రవి, మేడ్చల్ పశుసంర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ముంత ఆదిత్య కేశవ సాయి, రంగారెడ్డి జిల్లా భూగర్బ జల అధికారి రఘుపతి రెడ్డి, వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ సంగు గణేష్‌లను ఎసిబి అధికారులు అరెస్ట్ చేశారు. గొర్రెల పంపిణీలో భారీగా అవకతవకలు జరిగాయనే ఆరోపణ నేపథ్యంలో ఎసిబి అధికారులు కొద్దిరోజులుగా దర్యాప్తు చేస్తున్నారు. రికార్డుల పరిశీలన, బాధితుల నుంచి వివరాలు సేకరించి విచారణ చేపట్టారు. బినామీల పేర్లతో నిధులను దారి మళ్లించారనే ఆధారాలను సేకరించారు. ఈ కేసులో పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారులు, కాంట్రాక్టర్ల పాత్రలపైనా ఎసిబి అధికారులు ఆరా తీస్తున్నారు. ఇటీవల కాగ్ కూడా ఈ పథకంలో భారీగా అవకతవకలు జరిగాయని తన నివేదికలో పేర్కొంది.
మాజీ మంత్రికి ఉచ్చు బిగియనుందా..!?
గొర్రెల స్కీమ్ లో జరిగిన స్కామ్ పై గచ్చిబౌలి పోలీసు స్టేషన్లో ఎఫ్‌ఐఆర్ నమోదు కాగా ఈ కేసులు ఎసిబికి బదిలీ చేశారు. ప్రైవేట్ వ్యక్తులతో కలిసి ఉన్నతాధికారులు బినామీ ఖాతాలు తెరిచి రూ.2.10 కోట్ల నిధులు మళ్లించారని ఎసిబి గుర్తించింది. ఈ క్రమంలో ఓ వైపు అధికారుల అరె స్టుల పర్వం తీవ్ర కలకలం రేపుతున్నది. అయితే కేసు పూర్వపరాలు ఎలా ఉన్నా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కనుసన్నల్లోనే ఈ అక్రమాలు జరిగాయనే ఆరోణలు గుప్పుమంటున్నాయి. దీంతో ప్రస్తుతం నలుగురు అధికారులు అరెస్ట్ కాగా, ఈ కేసులో అంతిమంగా మాజీ మంత్రికి ఉచ్చుబిగిసుకోనున్నాదా? అనేది గులాబీ పార్టీతో పాటు ఆయన అభిమానుల్లో చర్చగా మారుతున్నది. పశుసంవర్థక శాఖలో ఇప్పటికే ఫైల్స్ మాయం కేసు నడుస్తుండగా తాజాగా గొర్రెల పంపిణీ స్కీమ్ లో అక్రమాల కేసుపై ఎసిబి దూకుడుతో ఏం జరగబోతున్నదనేది సస్పెన్స్ గా మారింది. తీవ్రస్థాయిలో ఆసక్తిని రేపుతోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News