జెరూసలెం: గాజా కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం … నలుగురు మహిళా బందీలను శనివారం హమాస్ విడుదల చేసింది. ఆ నలుగురి పేర్లు కరీనా అరీవ్, డానియెల్ గిల్‌బోవా, నామా లెవి, లిరి అల్ఫాజ్ . ఇందుకు ప్రతిగా 70 మంది పైగా పాలస్తీనియన్ ఖైదీలను ఇజ్రాయెల్ విడిచిపెట్టింది. ప్రస్తుతం విడుదలైన వారు మహిళా సైనికులు. గాజా సరిహద్దుకు సమీపం లోని నహల్ ఓజ్ మిలిటరీ బేస్ నుంచి వారిని 2023 అక్టోబర్ 7న హమాస్ బంధించి తీసుకెళ్లింది. 477 రోజులుగా వారు ఆ గ్రూప్ చెరలోనే మగ్గిపోయారు. తాజాగా ఆ నలుగురిని మిలిటరీ యూనిఫామ్‌లో తీసుకొచ్చి ,రెడ్‌క్రాస్‌కు అప్పగించగా, వారిని ఇజ్రాయెల్‌కు తీసుకెళ్తున్న వాహనం గాజాను వీడిందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
కాల్పుల విరమణ ప్రారంభమైన తొలిరోజు ముగ్గురు మహిళా బందీలను హమాస్ , వందకు పైగా పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. 42 రోజుల తొలిదశ కాల్పుల విరమణ ఒప్పందంలో తమ చెరలో ఉన్న 94 మంది బందీల్లో 33 మందికి హమాస్ స్వేచ్ఛ కల్పించనుంది. ప్రతిగా దాదాపు 1700 మందికి పైగా పాలస్తీనియన్లకు తమ జైళ్ల నుంచి ఇజ్రాయెల్ విముక్తి కల్పించనుంది. ఇజ్రాయెల్ చెర నుంచి 70 మంది పాలస్తీనా ఖైదీల విడుదల
ఇజ్రాయెల్ చెర నుంచి 70 మంది పాలస్తీనా ఖేదీలు విడుదలయ్యారు. విడుదలైన ఖైదీలు ఈజిప్టు వైపు రఫా సరిహద్దు దాటుకుని గాజాస్ట్రిప్ లోకి ప్రవేశించారు. వీరిలో చాలా మంది దేశ బహిష్కరణకు గురికావలసిన వారే. ఇజ్రాయెల్ 200 మంది పాలస్తీనా ఖైదీలను విడిచి పెడతారని మొదట అనుకున్నారు.
200 మందిని విడుదల చేసేందుకు ఇజ్రాయెల్ కూడా సిద్ధమైంది. అయితే హమాస్ చెరలో ఉన్న అర్బెల్ యెహోద్ అనే పౌర బందీ శనివారం హమాస్ చెర నుంచి విడుదల అవుతుందని ఇజ్రాయెల్ భావించింది. కానీ ఆమె విడుదల కానంతవరకూ ఉత్తర గాజాకు తిరిగి పాలస్తీనియన్లను ప్రవేశించనీయబోమని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం ప్రకటించింది. హమాస్ విడుదల చేసిన జాబితా ప్రకారం ఇజ్రాయెల్ నుంచి విడుదల కానున్న 200 మందిలో 121 మంది జీవితఖైదు అనుభవిస్తున్నవారే. ఇంకా 70 మంది గాజా , వెస్ట్‌బ్యాంకుల నుంచి బహిష్కరింపనున్న వారు. అయితే ఎక్కడ అన్నది పేర్కొనలేదు. ఇప్పుడు విడుదలైన 70 మంది పాలస్తీనా ఖైదీల్లో ఘరానా మిలిటెంట్లు మొహమ్మద్ ఒడేహ్(52). వాయెల్ కాస్సిం (54) ఉన్నారు. వీరిద్దరూ తూర్పు జెరూసలెంకు చెందినవారు. వీరు ఇజ్రాయెల్‌పై హమాస్ తరఫున వరుస దాడులు చేశారన్న ఆరోపణలున్నాయి.