అమ్రావతి/నాగపూర్: మహారాష్ట్రకు చెందిన అమ్రావతి జిల్లాలోని వార్ధా నదిలో మంగళవారం పడవ మునిగి నలుగురు వ్యక్తులు మరణించారు. మరో ఏడుగురు వ్యక్తులు గల్లంతయ్యారు. పడవలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు మాత్రం ఈదుకుంటూ సురక్షితంగా ఒడ్డును చేరుకున్నారని పోలీసులు తెలిపారు. బెనోడా పోలీసు స్టేషన్ పరిధిలోని వరుద్ తహసిల్‌లో ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది. చనిపోయిన తమ బంధువుకు సంబంధించిన దశదిన కర్మకు హాజరయ్యేందుకు సోమవారం వరుద్ తహసిల్‌లోని జుంజ్ గ్రామానికి వచ్చిన గడేవావ్కు చెందిన కొన్ని కుటుంబాలకు చెందిన 12 మంది పడవ సరంగుతో కలసి సమీపంలోని జలపాతాన్ని సందర్శించి ఆలయ దర్శనానికి వెళుతుండగా నదిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సామర్ధానికి మించి ఎక్కువ మంది పడవలోకి ఎక్కడంతో బరువును తట్టుకోలేక పడవ మునిగి ఉంటుందని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. పడవ సరంగుతోసహా నలుగురి మృతదేహాలు ఇప్పటివరకు లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. గల్లంతైన మిగిలిన ఏడుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు వారు చెప్పారు.