Monday, December 23, 2024

మూసీ, ఈసా నదులపై వంతెనలు

- Advertisement -
- Advertisement -

రూ.168 కోట్లతో హెచ్‌ఎండిఏ ఆధ్వర్యంలో ఐదు బ్రిడ్జిల నిర్మాణం
నేడు శంకుస్థాపన చేయనున్న మున్సిపల్ మంత్రి కెటిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్:  ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మూసీ, ఈసా నదులపై వంతెనల (బ్రిడ్జిల) నిర్మాణపనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ వంతెనల నిర్మాణానికి సంబంధించి అవసరమైన చర్యలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. మూసీ, ఈసా నదులపై 14 బ్రిడ్జిలు (వంతెనలు) నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. అయితే కరోనా (కోవిడ్) వల్ల రెండు సంవత్సరాల పాటు ఎదురైన పరిస్థితుల కారణంగా ఈ నదులపై వంతెనల నిర్మాణంలో జాప్యం చోటుచేసుకుంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్‌ఎండిఏ) ఆధ్వర్యంలో మూసీనదిపైన మూడు చోట్ల, ఈసా నదిపై రెండు చోట్ల వంతెనల నిర్మాణ పనులకు ప్రస్తుతం ముందుకు పడింది. సుమారు రూ.168 కోట్ల వ్యయంతో ఐదు వంతెనల నిర్మాణ పనులకు హెచ్‌ఎండిఏ ఇప్పటికే ఇంజనీరింగ్ ప్రోక్యూర్‌మెంట్ అండ్ కన్‌స్ట్రక్షన్ (ఈపిసి) పద్ధతిలో టెండర్ల ప్రక్రియను పూర్తి చేసింది. ఈ నేపథ్యంలోనే వాటికి మంత్రి కెటిఆర్ చేతుల మీదుగా నేడు శంకుస్థాపన జరుగనుంది.

హెచ్‌ఎండిఏ నిర్మించే ఐదు వంతెనల నిర్మాణాలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి…
1. ఉప్పల్ భగాయత్ లే ఔట్ వద్ద రూ.42 కోట్లతో వంతెన నిర్మాణం
2. ప్రతాప్‌సింగారం- గౌరెల్లి వద్ద వద్ద రూ.35కోట్లతో
3.మంచిరేవుల వద్ద రూ.39కోట్లతో
4.బుద్వేల్ ఐటీ పార్క్-2 సమీపంలో ఈసా నదిపై రూ.32కోట్లతో వంతెన,
5.బుద్వేల్ ఐటీ పార్క్-1 సమీపంలో ఈసా నదిపై రూ.20కోట్లతో హెచ్‌ఎండిఏ ఈ వంతెనల నిర్మాణాలను చేపట్టనుంది.

15 నెలల గడువులోగా పూర్తి
ఉప్పల్ భగాయత్, ప్రతాపసింగారం ప్రాంతాల్లో సుమారు 210 మీటర్ల పొడవున మూసీపై నాలుగు వరుసల (ఫోర్ లైన్) వంతెన నిర్మాణం చేపట్టనుంది. టెండర్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయినందున మంత్రి కెటి రామారావు సోమవారం (25వ తేదీన) వీటికి శంకుస్థాపన చేయనున్నారు. ఐదు వంతెన నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. వంతెనల (బ్రిడ్జిల) నిర్మాణ పనులను 15 నెలల గడువులోగా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు ఏడాదిన్నర కాలంలో హెచ్‌ఎండిఏ అన్నివంతెనల నిర్మాణాలు పూర్తి చేసి ప్రజలకు, వాహనదారులకు అందుబాటలోకి తీసుకురావాలన్న ప్రభుత్వం ధృఢసంకల్పంతో ఉంది. వంతెనలు పూర్తయితే మూసీ, ఈసా నదులపై వంతెనల నిర్మాణాలపై ప్రయాణం మరింత సులభతరం అవుతుంది. దీంతోపాటు ప్రయాణదూరం, సమయం గణనీయంగా తగ్గనుంది.

Moosi Isa bridge

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News