Saturday, January 11, 2025

పండుగపూట విషాదాలు

- Advertisement -
- Advertisement -

రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు ఘటనల్లో 10మంది మృతి

వార్ధా నదిలో ఈతకు వెళ్లి
నలుగురు యువకులు…
మంచిర్యాల, రంగారెడ్డి ,
మహబూబాబాద్ జిల్లాల్లో
నీటమునిగి మరో నలుగురు
మృతి మేడ్చల్ జిల్లాలో
లారీ ఢీకొని మరో ఇద్దరు దుర్మరణం

మన తెలంగాణ/ఆసిఫాబాద్ ప్రతినిధి (కౌటాల)/మహబూబాబాద్/దండేపల్లి/కంటోన్మెంట్/మహేశ్వరం: హోలీ పండుగ పూట సోమవారం పలు కుటుంబాల్లో విషాదఛాయలు నెలకొన్నాయి. కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, మహబూబాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో జరిగిన వేర్వేరు సంఘటనల్లో ఏడుగురు యువకులు, ఒక బాలుడు మృతి చెందారు. సికింద్రాబాద్ కంటోన్మెం ట్ పరిధిలో ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న వారిని లారీ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే..కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, కౌటాల మండలం, నదిమాబాద్ గ్రామానికి చెందిన ఆరుగురు స్నేహితులు సోమవారం ఉదయం హోలీ పండుగ సంబరాలు జరుపుకున్నారు. అనంతరం మధ్యాహ్నం స్నానం చేయడాని కో సం వార్ధా నది వద్దకు  వెళ్లారు.

వీరిలో ఇద్దరు స్నానం చేసి ఒడ్డుపైకి వచ్చారు. మిగతా నలుగురు నదిలో స్నానం చేస్తూ లోతుగా ఉన్న ప్రదేశంలోకి వెళ్లి గల్లంతయ్యారు. దీంతో నది ఒడ్డున ఉన్న మిగతా ఇద్దరు వెంటనే గ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో వారు పరుగుపరుగున వ చ్చి గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు గజ ఈతగాళ్లతో నదిలో గాలించగా అల్లం సాయి (22), ఉప్పల సంతోష్ (24), ప్రవీ ణ్ (24), కమలాకర్ (24) అనే నలుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులంగా ఒకే గ్రామానికి చెందినవారు కావడంతో ఆయా కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. జిల్లా ఎస్‌పి సురేష్‌కుమార్, డిఎస్‌పి కరుణాకర్, సంఘటన స్థలానికి చేరుకొని సంఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. మృతుల కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్త్తు చేస్తున్నట్లు సిఐ సాదిక్‌పాషా తెలిపారు.

పండుగ పూట ఒకే సారి నలుగురు స్నేహితులు మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. అదేవిధంగా మంచిర్యాల జిల్లా, దండేపల్లి మండలం, పాత మామిడిపల్లిలో జన్నారం మండలం, ధర్మారం గ్రామానికి చెందిన గోపులపురం కార్తిక్ (18) అనే ఇంటర్ విద్యార్థి హోలీ ఆడిన తర్వాత తానిమడుగు కడెం కాలువలో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే…గోపులపురం అశ్విని తమ ఇద్దరు కుమారులతో కలసి తల్లిగారి ఊరైన పాత మామిడిపల్లి గ్రామానికి వచ్చింది. సోమవారం ఉదయం 9 గంటలకు కార్తిక్ తన స్నేహితులైన ఆకుల మణికుమార్, పెట్టెం అన్విల్‌తో కలిసి హోలీ ఆడాడు. అనంతరం స్నానం చేయడానికి తానిమడుగు కడెం కాలువలో దిగారు. కాలువలో నీటి మట్టం ఎక్కువ ఉన్నందున కార్తిక్ నీటిలో మునిగిపోయాడు. అక్కడే ఉన్న అతని స్నేహితులు విభూతి అనిల్, అరవింద్ కార్తిక్‌ను బయటకు తీశారు.

అపస్మారక స్థితిలో ఉన్న కార్తిక్‌ను మేదరిపేటలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ స్వరూప్‌రాజ్ తెలిపారు. అదేవిధంగా మహబూబాబాద్ జిల్లా, నర్సింహులపేట మండలం, రామన్నగూడెంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అబ్బోరి వినోద్ రెడ్డి కుమారుడు రిత్విక్‌రెడ్డి (10) మండల కేంద్రంలోని సాయికృష్ణ హైస్కూల్‌లో 4వ తరగతి చదువుతున్నాడు. హోలీ పండుగ సందర్భంగా స్నేహితులతో కలిసి రంగులు చల్లుకున్నారు. అనంతరం స్నానం చేసేందుకు గణేశ్ చెరువు వద్దకు వెళ్లాడు. రంగులు కడుక్కొంటుండగా కాలు జారి చెరువులోని గుంతలో పడిపోయాడు. దీంతో అతని స్నేహితులు భయంతో వచ్చి గ్రామంలో చెప్పడంతో గ్రామస్థులు సంఘటనా స్థలానికి వెళ్లి చూసేసరికి రిత్విక్ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సతీశ్ తెలిపారు.

హోలీ వేడుకలకు ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న వారిని లారీ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. సికిందరాబాద్ బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో మేడ్చల్ జిల్లా, గుండ్లపోచంపల్లికి కె.వి.రెడ్డి నగర్ కాలనీకి చెందిన అకాష్ చావారియా (28) నందిని దంపతులు హోలీ పండుగను పురస్కరించుకొని తన భార్య నందినితో కలిసి ద్విచక్ర వాహనంపై ముషీరాబాద్ వెళ్తుండగా బోయిన్‌పల్లి డెయిరీఫాం వద్ద వేగంగా వచ్చిన లారీ వారిని ఢీకొంది. ఈ ప్రమాదంలో నందిని తీవ్రంగా గాయపడగా, ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. అదేవిధంగా ఇదే లారీ మరో ద్విచక్ర వాహనదారుడిని ఢీకొనడంతో ఆకాష్‌రాజ్ అనే వ్యక్తి మరణించాడు.రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం పోలీస్టేషన్ పరిధిలోని పెద్దచెరువులో ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు మృతి చెందారు.

సిఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం… మహేశ్వరం మండల పరిధిలోని నందుపల్లి గ్రామానికి చెందిన సంఘం జగన్ (35) కొమ్ము సురేందర్ (30)తో పాటు మరో నలుగురు మధ్యాహ్నం ఒంటి గంట వరకు హోలీ వేడుకలలో పాల్గొని సరదాగా పెద్దచెరువులో ఈతకు వెళ్లారు. సంఘం జగన్ కొమ్ము సురేందర్ ఈత కొడుతుండగా మిగతా నలుగురికి ఈత రాక గట్టుమీద కూర్చున్నారు. ఊపిరాడక మునిగిపోతున్న కొమ్ము సురేందర్‌ను గమనించి కాపాడటానికి దగ్గరికి వెళ్లిన సంఘం జగన్‌ను భయంతో గట్టిగా పట్టుకోవడంతో ఇద్దరూ నీటిలో మునిగిపోయి మృతి చెందారు. గట్టుపై ఉన్న నలుగురు యువకులు గ్రామంలోని వారి బంధువులకు, పోలీసులు సమాచారం ఇవ్వడంతో స్థానికులు చెరువులో గాలించి మృతదేహాలను గట్టుకు చేర్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News