Sunday, January 19, 2025

ఒకే కుటుంబం లోని నలుగురు హత్య, దహనం

- Advertisement -
- Advertisement -

జోధ్‌పూర్ (రాజస్థాన్) : రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సొంత జిల్లా జోధ్‌పూర్‌లో దారుణ సంఘటన జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని దుండగులు గొంతుకోసి హత్య చేసి, తరువాత వారిని దహనం చేశారు. జిల్లా లోని జోధ్‌పూర్ సిటీకి సమీపాన ఒసియాన్ ఏరియా చెరియా గ్రామంలో బుధవారం తెల్లవారు జామున ఈ సంఘటన జరిగింది. ఆ ఇంటి నుంచి పొగలు రావడంతో స్థానికులు అనుమానంతో పోలీస్‌లకు సమాచారం అందించారు. పోలీస్‌లు ఆ ఇంటిలోకి వెళ్లి చూస్తే అప్పటికే ఆ కుటుంబం లోని అందరూ కాలిపోయి శవాలై ఉన్నారు. మృతుల్లో పూనారామ్ (55).భన్వరీ (50). మేనకోడలు ధాపు (23 ),వారి ఆరు నెలల పసికందు మనీషా ఉన్నారని జోధ్‌పూర్ రూరల్ ఎస్‌పి ధర్మేంద్రసింగ్ యాదవ్ చెప్పారు. కుటుంబ తగాదాలే ఈ సంఘటనకు కారణంగా ప్రాథమిక దర్యాప్తులో తెలియవచ్చిందని చెప్పారు.

కేసు దర్యాప్తుకు పోలీస్ బృందం ఏర్పాటైందని తెలిపారు. సాక్షాధారాలు సేకరించడానికి ఫోరెన్సిక్ టీంతోపాటు జాగిలాలను ఏర్పాటు చేశామన్నారు. హత్యల వెనుక కారణాలు కచ్చితంగా ఇంకా చెప్పలేమని, అయితే ఇది దొంగతనానికి సంబంధించిన సంఘటన కాదని పేర్కొన్నారు. కుటుంబంపై కక్షతో చంపడానికే దుండగులు పూనుకున్నట్టు తెలుస్తోందన్నారు. పూనారామ్ కొడుకు మంగళవారం రాత్రి భోజనం తరువాత క్వారీ పనికి వెళ్లినట్టు స్థానికులు తెలిపారు.జోథ్‌పూర్ కలెక్టర్ హిమాంశు గుప్తా, ఎస్‌పి సింగ్, ఇతర అధికారులు సంఘటన ప్రదేశానికి వెళ్లి పరిశీలించారు. ఈ కేసులో పూనారామ్ మేనల్లుడు ప్రధాన అనుమానితునిగా ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అతణ్ణి అరెస్టు చేశారు. జోథ్‌పూర్ ముఖ్యమంత్రి గెహ్లాట్ సొంత పట్టణమైనా నేరాలు ఎక్కువగా జరుగుతుండడం విచారకరమని రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీ నేత , నాగౌర్ ఎంపి హనుమాన్ బేణీవాల్ విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News