మైసూరు (కర్నాటక) : మైసూరులోని ఒక అపార్ట్‌మెంట్‌లో సోమవారం ఒక కుటుంబ సభ్యులు నలుగురు విగతజీవులుగా కనిపించారని పోలీసులు వెల్లడించారు. నగరంలోని విశ్వేశ్వరయ్య నగర్‌లో ఈ ఘటన సంభవించింది. మృతులను చేతన్ (45), అతని భార్య రూపాలి(43), వారి కుమారుడు కుశల్ (15), చేతన్ తల్లి ప్రియంవద (62)గా గుర్తించినట్లు పోలీసులు తెలియజేశారు. సీనియర్ పోలీస్ అధికారి ఒకరు ప్రాథమిక దర్యాప్తును ఉటంకిస్తూ, చేతన్ తన కుటుంబ సభ్యులకు విషం ఇచ్చి చంపి, ఆ తరువాత ఉరి వేసుకున్నాడని చెప్పారు.
మైసూరు పోలీస్ కమిషనర్ సీమా లట్కర్ ఆ తరువాత విలేకరులతో మాట్లాడుతూ, మైసూరు విద్యారణ్యపురి పరిధిలోని సంకల్ప్ అపార్ట్‌మెంట్‌లో ఒక కుటుంబ సభ్యులు నలుగురు మరణించారని, వారు రెందు వేర్వేరు ఫ్లాట్లలో నివసిస్తున్నారని, తల్లి ఒక ఫ్లాట్‌లో నివసిస్తుండగా, చేతన్, అతని భార్య, కుమారుడు రెండవ ఫ్లాట్‌లో ఉంటున్నారని చెప్పారు. చేతన్ ఒక మెకానికల్ ఇంజనీర్ అని, అతను 2019లో మైసూరుకు మారడానికి ముందు దుబాయిలో పని చేశాడని, అతను మైసూరులో ఒక లేబర్ కాంట్రాక్టర్ అని, ఆన్‌లైన్ ప్రక్రియ ద్వారా సౌదీకి కూలీలను పంపుతుండేవాడని ఆమె తెలియజేశారు. మరణాలకు కారణం ఏమిటని ప్రశ్నించినప్పుడు, ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ, క్రైమ్ ఆఫీసర్ బృందం పరిశీలిస్తున్నారని, వారి నివేదిక అందిన తరువాత తాను చెప్పగలనని సీమా లట్కర్ తెలిపారు.