శ్రీనగర్: జమ్మూ కశ్మీరులో మూడు చోట్ల జరిగిన వేర్వేరు ఎదురుకాల్పుల సంఘటనల్లో నలుగురు ఉగ్రవాదులు మరణించగా ఒక ఉగ్రవాదిని పోలీసులు అరెస్టు చేశారు. కశ్మీరు లోయలోని పుల్వామా, గుండెర్బల్, కుప్వారా జిల్లాల్లో ఈ ఎన్‌కౌంటర్లు జరిగాయి. పుల్వామాకు చెందిన చెవక్లాన్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పులలో ఒక పాకిస్తాన్ జాతీయుడితోసహా ఇద్దరు జైషె మొహమ్మద్(జెఇఎం) ఉగ్రవాదులు మరణించినట్లు ఐజి(కశ్మీరు) విజయ్ కుమార్ శనివారం తెలిపారు. శనివారం ఉదయం గుండెర్బల్ జిల్లలోని సెర్క్ ప్రాంతంలో ఉగ్రవాదులకు, భద్రతాదళాలకు మధ్య జరిగిన కాల్పుల పోరులో లష్కరే తాయిబాకు చెదిన ఒక ఉగ్రవాది మరణించాడు. కుప్వారా జిల్లాలోని హంద్వారాకు చెందిన నెచెమ రజ్వార్‌లో శనివారం ఉదయం జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో లష్కరే తాయిబా ఉగ్రవాదికి చెందిన ఒక ఉగ్రవాది మరణించినట్లు ఐజి తెలిపారు. శుక్రవారం రాత్రి నాలుగైదు ప్రాంతాలలో ఉమ్మడి గాలింపు చర్యలు చేపట్టామని, ఇప్పటి వరకు నలుగురు ఉగ్రవాదులు మరణించగా మరో ఉగ్రవాదిని సజీవంగా అరెస్టు చేశామని ఆయన చెప్పారు.